హరిరామ జోగయ్య (Harirama Jogaiah) లేఖలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఆయన పేరిట విడుదలైన లేఖ ఒకటి సంచలనం రేపుతోంది. పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)పై వస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమే అనిపిస్తున్నాయంటూ లేఖలో పేర్కొనడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ క్రమంలో హరిరామ జోగయ్య మరో లేఖ విడుదల చేశారు. ఆ లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
నారా లోకేశ్ చెప్పినట్టుగా ఎన్నికల తర్వాత సీఎం ఎవరనే విషయంలో నిర్ణయం జరగలేదని తనకు తెలిసిందని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ నుంచి తనకు స్పష్టమైన సమాచారం ఉందని వెల్లడించారు. గత ఎన్నికల్లో 60కు పైగా అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు 10వేలకు పైగా ఓట్లు వచ్చాయన్నారు. ఆయా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలన్నారు.
ఎన్నికల అయ్యే వరకు జనసేన సైనికులు ఓపిగ్గా ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని అధికారంలోకి తీసుకు రావాలని సూచించారు. అంతకు ముందు ఆయన పేరిట విడుదలైన లేఖ ఒకటి కలకలం రేపింది. కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడని తాము ఇప్పటి వరకు అనుకున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలా జరిగే పరిస్థితులు కనిపించడం లేదన్నారు.
ఇదంతా చూస్తుంటే ప్రతిపక్షాలు చేస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమేనా అని అనుమానం కలుగుతోందన్నారు. ఆ లేఖ వైరల్ కావడంతో దానిపై ఆయన స్పందించారు. తాను ఆ లేఖ రాయలేదన్నారు. టీడీపీ-జనసేన స్నేహాన్ని దెబ్బతీసేందుకు వైసీపీ సానుభూతి పరులు ఒక ఫేక్ లెటర్ విడుదల చేశారని అన్నారు. దీన్ని జనసైనికులు గమనించాలని స్పష్టం చేశారు.