కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఆటో డ్రైవర్లకు రూ.15వేల జీవన భృతి ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీష్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ కార్మికులను రోడ్డున పడేసిందని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆటోవాలలా జీవితంలో పండుగ వాతావరణం కనుమరుగైందని తెలిపారు.
ఆటోకార్మికులు కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బాధలు గట్టెక్కుతాయని అనుకున్నారని, కానీ వచ్చిన వారం రోజులకే ఇలా రోడ్డున పడతామని అనుకోలేదంటున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దని సూచించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినప్పటికీ.. బస్సులు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మారుమూల గ్రామాలకు మరిన్ని బస్ సౌకర్యాలు పెంచాలన్నారు. ఆటో కార్మికులకు నెలకు 15వేల జీవన భృతి కల్పించాలని, లేదంటే వారు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వెల్లడించారు.