మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) భారతీయ జనతా పార్టీ(BJP)పై కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ తరఫున హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మాటలు నీటి మీద రాతలని, అందుకే ఆ పార్టీకి నేతలు గుడ్ బై చెప్తున్నారని అన్నారు.
బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. బీజేపీపై సొంత పార్టీ నాయకులకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ గెలవదనే నిజం తెలిసి రోజుకో నాయకుడు పార్టీ వీడుతున్నారని తెలిపారు. విజయశాంతి, వివేక్, రాజగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ లాంటి నాయకులు పార్టీకి టాటా చెప్పారని గుర్తు చేశారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటీ నేరవేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలు నెరవేర్చలేదు కానీ.. ఇక్కడ ఆరు గ్యారెంటీలు అంటూ చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపామన్నారు. కేంద్రం తొమ్మిదేళ్లు నానబెట్టి ఎన్నికల వేళ కొత్త కమిటీ అని చెబుతోందని మండిపడ్డారు. ‘మనకు కావాల్సింది కమిటీ కాదు.. బిల్లు..’ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని హరీశ్‌రావు జోస్యం చెప్పారు. వర్గీకరణ తప్పకుండా చేసి తీరుతామన్నారు.