కాంగ్రెస్(Congress) ప్రభుత్వం రైతుల(Farmers)ను ఆదుకోవడంలో విఫలమైందని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల చింతబావి తండాలో ఎండిపోయిన పంట పొలాలను హరీశ్ రావు, కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో రైతులకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక రైతులకు మొండి చేయి చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంద రోజులు గడిచినా.. రైతుబంధు(Rythu Bandhu) ఇవ్వని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీశ్ రావు మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎకరానికి 25వేల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు 500 బోనస్ ఇస్తా అని నమ్మబలికిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని సెటైర్లు వేశారు. రైతులకు 500 బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి రైతులను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వడగండ్ల వానలు పడి పంట నష్టం తీవ్రంగా జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 180 మంది రైతులు మృతిచెందిన వారిని ఓదార్చలేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుల ఇండ్లలోకి పోయి పార్టీలోకి తెచ్చుకునే టైం ఉంటుందనీ.. రైతులను ఓదార్చే సమయం లేదని హరీశ్ రావు ఆరోపించారు. సీఎం తెరవాల్సింది కాంగ్రెస్ పార్టీ గేట్లు కాదనీ.. ప్రాజెక్టుల గేట్లు అని చెప్పుకొచ్చారు. సీఎం, మంత్రులు తక్షణమే ఎండిపోయిన పొలాల దగ్గరికి వెళ్లి పంటలను పరిశీలించి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.