కాంగ్రెస్ (Congress) సర్కార్ పై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఆరు గ్యారెంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై స్పష్టత లేదన్నారు. వంద రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. లోక్ సభ ఎన్నికల కోడ్ ను సాకుగా చూపి ఆ గ్యారెంటీల అమలు చేయరేమో అని పిస్తోందన్నారు.
సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ….. ఆరు గ్యారెంటీల అమలుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను దరఖాస్తుల పేరిట పార్లమెంట్ ఎన్నికల వరకు సాగదీసి ఆ తర్వాత ఎన్నికల కోడ్ ను సాకుగా చూపి హామీలను అమలు చేయరనిపిస్తోందని అన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశ పెట్టి హామీలను దాటవేస్తారేమోననిపిస్తోందన్నారు.
కోడ్ ఇబ్బంది రావొద్దు అంటే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి మూడోవారంలోపు నిబంధనలు విడుదల చేసి ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఫిబ్రవరిలోనే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. వాస్తవానికి ఏ విషయంలోనైనా గైడ్ లైన్స్ విడుదల చేస్తారని తెలిపారు. కానీ ఇప్పుడు గైడ్ లైన్స్ లేకుండా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందన్నారు.
ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. రైతులకు బోనస్ ఇచ్చే విషయంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ మేరకు వెంటనే జీవోను కూడా విడుదల చేయాలన్నారు. ఇప్పటి వరకు ఎంత రైతు బంధు వేశారో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. గతంలో కరోనా కాలంలో కూడా తమ ప్రభుత్వం రైతు బంధు పంపిణీ చేసిందన్నారు.
అది రైతుల పట్ల తమకు ఉన్న కమిట్ మెంట్ అని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేదలు పది లక్షల ఆరోగ్య శ్రీ ప్రయోజనం పొందారో చెప్పాలని నిలదీశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఏఐసీసీ అగ్ర నేతలు ప్రియాంక, రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. కానీ తాము అలా చెప్పలేదని సభలో ఇప్పుడు భట్టి విక్రమార్క మాట మార్చారని పేర్కొన్నారు. ఇది ఎగవేతనే కదా అని అడిగారు.
కాంగ్రెస్ సర్కార్ తీరు చూస్తుంటే కోతలు, దాటవేత, ఎగవేతలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఏ తేదీన ఏ నోటిఫికేషన్ ఇస్తారో తేదీల వారీగా పేపర్ ప్రకటనలు చేశారన్నారు. ఫిబ్రవరి 1న ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుంటే యువతను మోసం చేసినట్టేనన్నారు.
కార్లను కేసీఆర్ కొన్న విషయం వాస్తవమేని చెప్పారు. బీపీ కోసం ఇచ్చింది నిజమన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తే అది ప్రజల ఆస్తి కిందకు వస్తుందన్నారు. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకోవాలని సూచించారు. కార్లకు బీపీ చేసే మెకానిజం కేవలం విజయవాడలోనే ఉందని వివరించారు. అక్కడ దాచారని చెప్పడం సీఎం స్థాయికి తగదని ఫైర్ అయ్యారు.