గతంలో ఎంపీగా పని చేసిన సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) భువనగిరిని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే తెలంగాణ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో హరీశ్ రావు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ….. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక…. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత దాడులకు పాల్పడుతారా ? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా పోలీసులను వాడుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల అమలు చేయాలని సూచించారు. లేకపోతే కాంగ్రెస్‌కు ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని… ఒక వేళ తాము ఒకటే అయితే కరీంనగర్లో బండి సంజయ్‌ను, కోరుట్లలో ధర్మపురి అర్వింద్‌ను, బోథ్‌లో సోయం బాపు రావు, హుజూరాబాద్, గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ను, దుబ్బాక రఘునందన్ రావును ఎందుకు ఓడిస్తామని ప్రశ్నించారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెబుతారని అన్నారు.