మాజీమంత్రి హరీశ్‌రావు(Harishrao) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Cogress Government) జిల్లాలను ఊడగొట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలను తొలగిస్తాని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, సిద్ధిపేట జిల్లా లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
జిల్లాలు ఉండాలంటే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని, 2002 ఏప్రిల్ హైదరాబాద్ జలా దృశంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం నేడు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలను కేంద్ర ప్రభుత్వమూ రైతుబంధు లాంటి పథకాలను కాపీకొట్టిందన్నారు.
కేసీఆర్ అభివృద్ధికి ఆదర్శంగా ఉంటే, రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. నాడు ఓటుకు నోటులో దొరికి నేడు దేవుళ్లపైన ఓట్లు అడుగుతున్నాడని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రాజీనామా చేస్తానని కిషన్ రెడ్డి ఆనాడు వాగ్దానం చేశాడని గుర్తుచేశారు. రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి జిరాక్స్ పేపరు ఇస్తే కిషన్ రెడ్డి తప్పించుకుని తిరిగాడని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తానూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని హరీశ్‌రావు సవాల్ చేశారు. తనకు సొంత ప్రయోజనాలు, పదవి ముఖ్యం కాదన్నారు. రైతులు, ప్రజల ప్రయోజనమే ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, గ్యారెంటీలు అమలు చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ చేయాలని అడిగితే కాంగ్రెస్ మంత్రులు తనను తిడుతున్నారని అన్నారు. ఎవరెన్ని తిట్టినా ప్రతిపక్షనేతగా పోరాటం చేస్తూనే ఉంటానని హరీశ్‌రావు తెలిపారు.