కేంద్ర ప్రభుత్వం పై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శల బాణాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్‌ను మహిళా, శిశు, గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) తో కలిసి ప్రారంభించిన ఆయన బీజేపీ (BJP) నీచ రాజకీయాలు చేస్తోందని, అందుకు గవర్నర్‌ను అడ్డుపెట్టుకొంటుందని అన్నారు.
ఎరుకల కులానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ (MLC) పదవి వస్తే బీఆర్ఎస్కు అనుకూలంగా వారందరూ ఉంటారనే భయం మొదలైందని విమర్శించారు. అందుకే ఎరుకల జాతికి చెందిన కుర్ర సత్య నారాయణ ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఎరుకలు, విశ్వ బ్రాహ్మణులు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు.
హైదరాబాద్ నుంచి కోతల గ్యాంగ్, మహిళా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మీద పోటీకి సిద్దం అవుతోందని ఇలాంటి తోడేళ్లకు తగిన బుద్ధి చెప్పి పద్మా దేవేందర్ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
ఇక సిద్దిపేట పట్టణంలో 7.50 కోట్ల తో నిర్మించిన ముదిరాజ్ కన్వేన్షన్ సెంటర్ ను కూడా మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మరో రూ. 50 లక్షలు పనులను పూర్తి చేసేందుకు కేటాయిస్తానన్నారు. కాగా 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ముదిరాజ్ బిడ్డకు సొసైటీల్లో సభ్యత్వం కల్పించినట్టు తెలిపారు. అంతేగాకుండా రాష్ట్రంలో కొత్తగా రెండు వేల సొసైటీల ను ఏర్పాటు చేసి 2 లక్షల మందికి కొత్తగా సభ్యత్వాలు ఇస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.