‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే నీళ్లు తగ్గాయి.. కన్నీళ్లు పెరిగాయి..’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) హరీశ్‌రావు(Harishrao) విమర్శించారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన ఏ హామీని అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకోలేదన్నారు.
100రోజుల్లో అమలు చేస్తామని రైతులకు అనేక హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అభద్రతాభావంలో ఉన్నదని.. అందుకే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టాల్సింది పోయి రైతులకు అపాయాన్ని కలిగిస్తోందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు.
లో ఓల్టేజీ సమస్యతో బావుల వద్ద మోటార్లు కాలిపోయి అన్నదాతలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను పరామర్శించేందుకు సీఎం, మంత్రులకు తీరికలేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులను కంటిరెప్పలా కాపాడుకున్నామని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఎప్పుడూ రైతుల పక్షానే బీఆర్ఎస్ ఉందన్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ పొలం బాట పట్టడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగిందని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ పర్యటనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీటిని విడుదల చేసిందన్నారు. అదేవిధంగా 24 గంటల్లో కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పంట నష్టపోయిన రైతుకు రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు. అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.