ఇరిగేషన్ శాఖపై తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం (White Paper)పై అసెంబ్లీలో శనివారం చర్చ జరిగింది. ఈ శ్వేత పత్రంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అది శ్వేతపత్రం కాదు… ఫాల్స్ పేపర్ అంటూ మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్రజెంటేషన్‌లో అన్నీ అబద్దాలే చెప్పారని ఫైర్ అయ్యారు.
శ్వేత పత్రంపై ఎన్ని గంటలైనా చర్చిద్దామని…ఎంత సమయమైనా ఇస్తామని సభా నాయకుడు తెలిపారని అన్నారు. ఇంత మంచి విషయంపై కేవలం 30 నిమిషాల్లో చర్చ అంటే సరిపోదని అన్నారు. తనకు కనీసం రెండు గంటలైనా కేటాయించాలని కోరారు. తాను మాట్లాడుతున్న సమయంలో మంత్రులు నోట్ చేసుకోవాలని సూచించారు.
మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయనే విషయం అవాస్తవమని అన్నారు. ఈ ప్రాజెక్టులను తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని చెప్పారు. మధ్య మానేరు సమైక్య రాష్ట్రంలో పూర్తి చేసిన అంశం నిజమని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
శ్వేతపత్రంలో పేర్కొన్న ఖర్చులు, ఆయకట్టు అంశాలు రెండుచోట్ల వేరువేరుగా ఉన్నాయని వివరించారు. రూ.54,239 కోట్లు ఖర్చు పెట్టి 57.79 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని ఒకచోట చెప్పారని, మరోచోట రూ.54,234 కోట్లు ఖర్చు చేసి 41.76 లక్షల ఎకరాలకు నీరందించినట్లు చెప్పినట్లు పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదనేది అవాస్తవమని స్పష్టం చేశారు.
చట్టసభల్లో ప్రభుత్వం ఇలాంటి అసత్యాలతో పత్రాలు సభలో పెట్టడం సరికాదని మండిపడ్డారు. గత ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతోనే శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఫాల్స్ పేపర్ ప్రవేశపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికల సభల్లో చేసినట్లే శాసనసభలోనే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. పదేపదే అబద్ధాలు చెప్పి అదే నిజమనే భ్రమ ప్రజల్లో కల్పిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకు ముందు శాసన సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పపవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ కోసం ఓ టెక్నీషియన్ సభలోకి వచ్చారు. మెంబర్ కాకుండా ఇతరులు సభలోకి రాకూడదంటూ బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అడ్వకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావొద్దని.. టెక్నీషియన్‌ను సభలోకి అనుమతించవద్దని స్పీకర్ ను హరీశ్ రావు కోరారు.