కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harishrao) ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) హత్నూర మండలం(Hathnoora mandal) చందాపూర్(Chandapur) కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో పరామర్శించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమన్నారు. వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సహాయక చర్యలూ సరిగ్గా చేయలేదని విమర్శించారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని గాలికి వదిలేశారు అని హరీశ్ రావు అన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ తరపున చనిపోయిన వారికి, గాయపడిన వారికి సహాయం చేస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ.25లక్షల సాయం అందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారని, మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కోరారు.
గాయపడిన వారికి పూర్తిగా ఉచిత వైద్యం అందించాలన్నారు. ప్రమాదం గురించి, క్షతగాత్రులు సరైన సమాచారం లేదని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఉన్నారు.