ప్రస్తుత కాలంలో ఆరోగ్యం అనేది చాలా ఖరీదుగా మారింది. పంచభూతాల నుంచి ఉచితంగా వచ్చే వాటిని.. డబ్బులు పోసి కొనుక్కునే దుస్థితికి దిగజారి పోయారు మనుషులు.. ప్రకృతికి వొదిగి ఉండవలసిన మనిషి.. ప్రకృతిపై ఆధిపత్యం చలాయిస్తూ.. చివరికి వినాశనానికి బాట వేసుకున్నాడని పర్యావరణ వేత్తలు గొంతు పగిలేలా చెబుతున్నారు. ప్రస్తుతం చూస్తే దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి రోజు రోజుకి చాలా ఘోరంగా మారుతుంది.
ఢిల్లీలో (Delhi) ప్రజలు తీవ్రమైన వాయు కాలుష్యం (Air pollution)తో విలవిల్లాడుతున్నారు. అసలే వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. దాంతో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో జనం అనారోగ్య సమస్యలు (Health problems) ఎదుర్కొంటున్నారు. మరోవైపు వైద్యులు, ఆరోగ్య నిపుణులు వాయు కాలుష్యం చాలా హానికరమైనదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మానవ శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరించారు.
ఢిల్లీ ఎయిమ్స్ అదనపు ప్రొఫెసర్, డాక్టర్ పీయూష్ రంజన్ (Dr. Piyush Ranjan).. వాయు కాలుష్యం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉన్నట్టు.. తెలియజేసే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యవస్థకు హాని కలుగుతుందని, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులు కూడా సంభవించే అవకాశం ఉందని ప్రొఫెసర్ తెలుపుతున్నారు.
ఈ కాలుష్యం శరీరంలోని వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. అన్ని వయసులవారి మెదడు, గుండెను కాలుష్యం దెబ్బతీస్తుందని తెలిపిన డాక్టర్ పీయూష్.. ముందు జాగ్రత్తతో వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు..