ఏపీలోని అల్లూరి జిల్లా(Alluri district)లో హృదయ విదారకమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశామని మన పాలకులు చెప్పుకుంటుంటారు. వాస్తవానికి ఇప్పటికీ మనదేశంలో చాలా పల్లెలు, మారుమూల ప్రాంతాల్లో సరైన రోడ్ కనెక్టివిటీ, లైటింగ్, రవాణా సౌకర్యం, వైద్య సౌకర్యాలు లేని పల్లెలు, గ్రామాలు, ఏజెన్సీలు చాలా ఉన్నాయి.సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే ఓ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని ఏకంగా 8 కిలో మీటర్లు మోయాల్సి వచ్చింది. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకివెళితే.. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ కొండ శిఖర, చిన్నకోనల గ్రామానికి చెందిన సారా కొత్తయ్య కుటుంబం
రెండు నెలల కిందట గుంటూరు జిల్లా కొల్లూరు ఏరియాకు బతుకుదెరువు కోసం వలస వెళ్లింది. అక్కడే ఓ ఇటుక బట్టిల్లో కొత్తయ్య, ఆయన భార్య సారా సీత పనుల్లో చేరారు. వీరికి ఇద్దరు పిల్లలు.
కొత్తయ్య దంపతులు తమ పిల్లలను వెంటబెట్టుకుని ఇటుక బట్టి పనులకు వెళ్తుండేవారు. అయితే, అనుకోకుండా కొత్తయ్య కొడుకు అనారోగ్యానికి గురయ్యాడు. అక్కేడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇటుక బట్టి మేస్త్రి,యాజమాన్యం మంగళవారం సాయంత్రం అంబులెన్స్ మాట్లాడి కొత్తయ్య కుటుంబాన్ని వారి సొంతూరుకు పంపించింది.
అయితే, ఉగాది పండగ రోజు తెల్లవారుజాము 2 గంటలకి విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ గ్రామం వద్ద బాలుడు శవాన్ని(son dead Body carry by father), తల్లిదండ్రులను దించేసి అంబులెన్సు వెళ్లిపోయింది.వారి గ్రామానికి వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో కొత్తయ్య తన కొడుకు మృతదేహాన్ని భుజం మీద వేసుకుని పొద్దున 5 గంటల ప్రాంతంలో 2 ఎత్తైన కొండలు ఎక్కి దిగాడు. ఇలా 8 కిలోమీటర్లు కాలినడకన కొత్తయ్య తన కొడుకు శవాన్ని మోస్తూ స్వగ్రామైన చిన్నకోనెలకు చేరుకున్నాడు.