తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రజలు చలితో గజగజ వణుకుతున్నారు. అదే సమయంలో దట్టమైన పొగమంచు(Heavy Fog) కారణంగా రోడ్లపై రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
పొగమంచు కారణంగా శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పైలట్లకు రన్‌వే కనిపించకపోవడంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు ఉదయం 6నుంచి 9 గంటల వరకు విమానాలను నిలిపివేశారు.
35 జాతీయ, అంతర్జాతీయ విమానాలను విజయవాడ, బెంగళూరు, ముంబై, నాగ్పూర్ నగరాలకు మళ్లించారు. ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సిన గోవా, తిరువనంతపురం, చండీగఢ్ విమానాలను విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి పంపించారు.
చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో నల్గొండ జిల్లాలో ఇద్దరు, వికారాబాద్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. ఏజెన్సీపై చలి తీవ్రత పెరిగింది. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో 8.6 డిగ్రీలుగా నమోదుకాగా.. అదిలాబాద్ జిల్లా సొనాలలో 9.9 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 10.6డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.