మణిపూర్ (Manipur)లో ఓ పవర్ స్టేషన్ నుంచి భారీగాఇంధనం లీకైంది. కాంగ్ పోక్సి జిల్లా లిమాఖోంగ్ పవర్ స్టేషన్ (Leimakhong Power Station)లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో మణిపూర్ సర్కార్ అలర్ట్ అయింది.
లిమాఖోంగ్ పవర్ స్టేషన్ నుంచి లీక్ అవుతున్న ఇంధనం ఇంపాల్ లోయ గుండా ప్రవహిస్తున్న కాంటోసాబల్, సెక్మాయి నదుల్లోకి చేరుతోందని వెల్లడించింది. పవర్ స్టేషన్ నుంచి లీక్ అయిన ఇంధనం ఇప్పటికే సమీపంలోని పలు సెలయేర్లలోకి చేరింది. అక్కడక్కడ మంటలు కూడా చెలరేగాయి. ఇంధన ప్రవాహం ఖుర్ఖుల్-లోయిటాంగ్-కమెంగ్-ఇరోయిసెంబా-నంబుల్ ద్వారా చివరకు దిగువ ఇంఫాల్ నదిలో కలవనుంది.
ఈ నేపథ్యంలో ఇంధన ప్రవాహాన్ని కట్టడి చేయాలని సంబంధిత శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంధనం నదుల్లోకి చేరకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను మణిపూర్ సర్కార్ ఆదేశించింది. పర్యావరణ విపత్తును నివారించడానికి, యంత్రాలు, మానవశక్తి, నైపుణ్యం పరంగా అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కార్యాలయం అన్ని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు డిప్యూటీ కమిషనర్ (ఇంఫాల్ వెస్ట్) అధికారులను సమన్వయం చేస్తారని పేర్కొంది. మణిపూర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ (పీహెచ్ఇడి) మంత్రి లీషాంగ్ థెమ్ సుసింద్రో మైతేయ్, అటవీ శాఖ మంత్రి తొంగమ్ బిశ్వజిత్ సింగ్ గత రాత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించారు.