Telugu News » డేంజర్ లో హైదరాబాద్.. మరోసారి సర్కార్ ఫెయిల్ అయినట్టేనా?

డేంజర్ లో హైదరాబాద్.. మరోసారి సర్కార్ ఫెయిల్ అయినట్టేనా?

by admin
Heavy Rain Effect in hyderabad 1

హైదరాబాద్ లో వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో సోషల్ మీడియాని అడిగితే చెప్పేస్తుంది. క్షణాల్లో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈసారి రుతుపవనాల ఆలస్యంతో వర్షాలు లేట్ గా ఎంట్రీ ఇచ్చాయి. ‘‘రావడంలో ఆలస్యం కావొచ్చు.. కానీ, దంచికొట్టడంలో తగ్గేదే లే’’ అన్నట్టు భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా శివరాంపల్లిలో 6.4 సెంటీమీటర్లు, చార్మినార్‌ లో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుస్సేన్ సాగర్‌ లోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో నీటిమట్టం 513.50 అడుగుల గరిష్ట స్థాయికి చేరింది. ఇంకొన్ని రోజులు భారీ వానలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. గత అనుభవాల దృష్ట్యా నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Heavy Rain Effect in hyderabad

కొద్ది రోజులుగా ఆఫీసు వేలల్లో కురుస్తున్న వానలకు ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోతోంది. రహదారులపై నీళ్లు నిలబడుతుండడంతో వాహనాలు ముందుకు కదలడం లేదు. దీంతో సర్కార్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో అయితే.. నగరవాసులు నరకం చూస్తున్నారు. ట్రాఫిక్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోమవారం వేల సంఖ్యలో కార్లు ట్రాఫిక్‌ లో చిక్కుకున్నాయి. దీంతో ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌ లో మంత్రి కేటీఆర్‌ కు ట్యాగ్‌ చేశాడు. ‘‘దయచేసి దీనిపై శాశ్వత పరిష్కారం చూపండి’’ అని కోరాడు. దీనికి మంత్రి స్పందించారు. వచ్చే కేబినెట్‌ లో హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపు అంశాన్ని ప్రధానంగా తీసుకున్నామని తెలిపారు. ఈ సమస్యపై కేసీఆర్ తమ శాఖను ఆదేశించారని, ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్నామని రాసుకొచ్చారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. వర్షాకాలం సమస్యలు ఎప్పటికి తీరుస్తారో అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రతీసారి వానాకాలంలో నగరంలోని రోడ్లు కాలువలను తలపించడం.. ట్రాఫిక్ నరకం కామన్ అయిపోయిందని.. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతోందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ప్రశ్నించినప్పుడల్లా.. అదిగో ఇదో అంటూ కాలయాపన చేస్తున్నారే గానీ.. పనులు జరగడం లేదని మండిపడుతున్నారు. రెండేళ్ల క్రితం వరదల సమయంలో ఇచ్చిన హామీలనే ఇప్పటి వరకు నెరవేర్చలేదని.. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో మెట్రో ఆశలు రేపుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా నగరంలో రోడ్ల అభివృద్ధి జరగడం లేదని.. ఎంతసేపూ చలానాల మీదే దృష్టి పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. గతేడాది నాలాల అభివృద్ధి అని చెప్పి.. ఈసారి వానాకాలానికి కూడా పనులు పూర్తి చేయలేదని ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే నీరు రోడ్లపై ఉంటోందని.. భారీ వర్షం పడితే తమ వాహనం పడవలా మారితే బాగుండు అనే ఆలోచన వస్తోందని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా వర్షాకాలం ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విమర్శలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని భయపడుతున్నారు.

You may also like

Leave a Comment