బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం కారణంగా తుపానుగా మారి దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించారు.
మించాంగ్ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో తుపాను పరిస్థితులపై ఏపీ సీఎం వైస్ఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా ముందస్తు చర్యల్లో భాగంగా సీఎం జగన్ తిరుపతి జిల్లాకు రూ.2కోట్లు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.కోటి చప్పున విడుదల చేశారు.
ఇక తమినాడులోని ఏడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నై, చంగల్‌పట్టు, తిరువళ్లూరు, కాంచిపురం, రానిపేట్, వెళ్లూరు, తెన్‌కాసి జిల్లాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరో 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. మరోవైపు, తుపాను నేపథ్యంలో డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు వివిధ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. 140కి పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.
గుజరాత్‌లోని బరూచ్ జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. స్థానికులు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుంభ వృష్టి కురుస్తుండటంతో సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. కాగా, నేడు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.