అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ (Henry Kissinger) (100) కన్నుమూశారు. కనెక్టికట్‌లోని నివాసంలో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ‘కిసింజర్ అసోసియేట్స్’ ప్రకటించింది.
1923 మే 7న జర్మనీ(Germany)లో కిసింజర్ జన్మించారు. 1938లో ఆయన కుటుంబం అమెరికా(America)కు వలస వెళ్లింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యంలో సేవ అందించారు. హార్వర్డ్ నుంచి పట్టా పొందిన ఆయన అదే యూనివర్శిటీలో 17 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు.
హెన్రీ కిసింజర్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. అమెరికాకు రెండు పర్యాయాలు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, జెరాల్డ్ ఫోర్డ్ హయాంలో ఆయన ఈ శాఖ బాధ్యతను నిర్వర్తించారు. ప్రభుత్వ ఏజెన్సీలకు కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరించారు. వియత్నాంలో విదేశాంగ శాఖకు మధ్యవర్తిగా సేవలు అందించారు.
అరబ్-ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించండంలో కిసింజర్ కీలక పాత్ర పోషించారు. 1971 భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలోనూ అమెరికా.. పాక్‌కు మద్దతు తెలపడానికి ఈయన విధానాలే కారణమని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నిక్సన్ పశ్చాత్తాపపడినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు.