టాలీవుడ్ హీరో నవదీప్ (Navdeep) ను మత్తు కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే 2017 కేసుతో ఎన్నో విచారణలను ఎదుర్కొన్న ఈ హీరో.. ఈమధ్య మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులోనూ ఇరుక్కున్నాడు. ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో విచారణను ఎదుర్కొన్నాడు. తాజాగా ఇదే కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ (ED) విచారణకు హాజరయ్యాడు.
2017లో టాలీవుడ్ మత్తు పదార్థాల కేసు సంచలనం రేపింది. పలువురు సెలెబ్రిటీలు విచారణను ఎదుర్కొన్నారు. అప్పట్లో నగరంలోని ప్రముఖులకు మత్తు పదార్థాలు సప్లై చేస్తున్న సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన కెల్విన్, చాంద్రాయణగుట్ట ఇస్మాయిల్ నగర్ కు చెందిన సోదరులు ఎండీ అబ్దుల్ వహాబ్, ఎండీ అబ్దుల్ ఖుద్దూస్ లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, సినీ ప్రముఖులకు వీరు విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు.
ఈ కేసుపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్ టీమ్ పదిమంది సినీ ప్రముఖులకు నోటీసులిచ్చి వారిని విచారించింది. హీరో రవితేజ కారు డ్రైవర్ తో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి సహా చాలా మందిని ప్రశ్నించింది. ఈ కేసు లావాదేవీలకు సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అయింది.
ఇటీవల మాదాపూర్ కేసులో నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు విచారించారు. ఈ కేసు వివరాలను తమకు ఇవ్వాలని వారిని ఈడీ అధికారులు కోరారు. మాదకద్రవ్యాల విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. నైజీరియన్లతో నవదీప్ కు ఉన్న పరిచయాలు, జరిగిన లావాదేవీలపై విచారిస్తున్నారు.