Telugu News » Group-1 : గ్రూప్-1 మళ్లీ రద్దు.. పాపం ఎవరిది..? శిక్ష ఎవరికి..?

Group-1 : గ్రూప్-1 మళ్లీ రద్దు.. పాపం ఎవరిది..? శిక్ష ఎవరికి..?

ఈ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానం విచారణ జరిగింది. విచారణ అనంతరం గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేస్తున్నట్టు శనివారం ప్రకటించింది హైకోర్టు.

by admin
High_Court_of_Telangana_in_Hyderabad

– గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు
– ప్రకటించిన హైకోర్టు
– మళ్లీ జరపాలని ప్రభుత్వానికి ఆదేశాలు
– ఇప్పటికే పేపర్ లీకేజ్ తో ఓసారి రద్దు
– ఇప్పుడు నిర్వహణా లోపంతో నిలిపివేత
– గందరగోళంలో 2.30 లక్షల మంది అభ్యర్థులు

ఒకరి తప్పుకు ఇంకొకరు బలి అంటారు కదా.. గ్రూప్-1 (Group-1) పరీక్షల నిర్వహణ తీరు అలాగే ఉంది. ఎవరో చేసిన తప్పులకు అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఎంతో కష్టపడి ప్రిలిమ్స్ పరీక్ష రాస్తుంటే.. వరుసగా రద్దు అవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. ఈ మేరకు హైకోర్టు (High Court) తీర్పునిచ్చింది.

High Court Suspended Govt GO on Telangana VRAs Adjustment

ఈ ఏడాది జూన్ 11న టీఎస్పీఎస్సీ (TSPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. అయితే.. ఈ పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు సేకరించలేదని, హాల్‌ టికెట్ నెంబర్‌, ఫొటో లేకుండా ఓఎంఆర్ షీట్స్ ఇచ్చారని అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు. ఈ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానం విచారణ జరిగింది.

విచారణ అనంతరం గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేస్తున్నట్టు శనివారం ప్రకటించింది హైకోర్టు. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇలా వరుసగా ప్రిలిమ్స్ పరీక్ష రద్దవుతుండడం మిగిలిన అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తోంది.

2022, అక్టోబర్ 16న తొలిసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ ను నిర్వహించారు. ఫలితాలు కూడా విడుదలయ్యాయి. అభ్యర్థులు మెయిన్స్ కు సిద్ధం అవుతున్న సమయంలో పేపర్ లీకేజీ బాగోతం వెలుగుచూసింది. దీంతో ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ 11న మరోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ పరీక్షకు 2.33 లక్షల మంది హాజరయ్యారు. పరీక్ష నిర్వహించి మూడు నెలలు దాటినా ఇంత వరకు ఫలితాలు విడుదల కాలేదు. ప్రాథమిక కీ మాత్రమే వదిలారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ లో గ్రూప్-1 మెయిన్ ఉంది. దానికోసం అభ్యర్థులు ప్రిపేర్ అవుతుండగా.. ఇప్పుడు మరోసారి ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది.

You may also like

Leave a Comment