మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తప్పుడు అఫిడవిట్ కేసుపై హైకోర్టు (High Court) తుది తీర్పు ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది. ఎన్నికల సమయంలో మంత్రికి ఊరట దక్కింది.
2018 ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ అసలు నిజాలు లేవని.. పైగా, తర్వాత ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లాకు చెందిన చలువగాలి రాఘవేంద్ర రాజు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత ఆయనకు లేదని అందులో పేర్కొన్నాడు. దీనిపై వాదనలు కొనసాగగా.. మంత్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. ఇదే క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
తన ఎన్నిక చెల్లదన్న పిటిషన్ ను కొట్టివేయాలని కోరుతూ శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు కొట్టివేసింది. అయితే.. రాఘవేంద్రరాజు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ లో ఎలాంటి అర్హత లేదని శ్రీనివాస్ గౌడ్ మరో పిటిషన్ వేశారు. హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. సోమవారం రోజున మరోసారి విచారణ జరిపి ఈ వివాదంపై తీర్పు మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
తాజాగా రాఘవేంద్ర రాజు వేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. పిటిషనర్ వాదనతో ఏకీభవించలేదు. ఈ తీర్పుతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ రిలీఫ్ లభించింది. నాలుగున్నరేళ్లు ఈ కేసు విచారణ కొనసాగింది.