ఈమధ్య కాలంలో ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు, వసతుల కోసం విద్యార్థుల ధర్నాలు కామన్ అయిపోయాయి. బంగారు తెలంగాణ పాట పాడుతున్న కేసీఆర్ (KCR) ప్రభుత్వం మాటలకే పరిమితం అయిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఇదే క్రమంలో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు (High Court) లో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగగా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
మన్ననూర్, మోర్తాడ్, హుజూరాబాద్, మంచాలలో వరుసగా కలుషిత ఆహారం తీసుకుని విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. దాదాపు 300 మంది కడుపునొప్పి, తలనొప్పి, ఫుడ్ పాయిజన్, తీవ్రమైన జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. పిల్లల ప్రాణాల రక్షణకు చర్యలు చేపట్టాలని న్యాయవాది వాదించారు.
ఉచిత, నిర్బంధ, విద్యా హక్కు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాణ్యమైన ఆహారం లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. మంచినీరు, కిచెన్, మరుగుదొడ్ల పరిశుభ్రత లేక విద్యార్థులు కడుపు బాధపడుతున్నారని వాదించారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
గురుకుల హాస్టల్స్ లో సరైన సదుపాయాలు ఎందుకు కల్పించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది న్యాయస్థానం. రెండు వారాల్లోగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్స్ లో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. అంతేకాదు, గురుకుల హాస్టల్స్ స్టేటస్ పై రెండు వారాల్లోగా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది హైకోర్టు.