అసెంబ్లీ ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు పర్యాటక శాఖ కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు(MD Manohar Rao)పై ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దీనిపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో తెలంగాణ హైకోర్టు(High Court) అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణలోగా నిర్ణయం తీసుకోవాలని లేదంటే కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అక్టోబర్ 15, 16 తేదీల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి ఎండీ మనోహర్ రావు, ఓఎస్జీగా పనిచేస్తున్న విశ్రాంత అధికారి సత్యనారాయణ తిరుమల వెళ్లారు. ఈ విషయంలో వారిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం మనోహర్ రావుపై సస్పెన్షన్ వేస్తూ, శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని నవంబర్ 17 ఆదేశించింది. ఈ విధంగా ఎన్నికల సమయంలో పలు అధికారులను సస్పెండ్ చేసింది. అందులో మాజీ డీజీపీ అంజనీ కుమార్ కూడా ఉన్నారు.
డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసినపుడు దీనిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో నిర్ణయం తీసుకోవాలని రెండు వాయిదాలు వేసినా స్పందించలేదని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు తాము కేసు పూర్వాపరాలపై విచారణ చేపడతామని పేర్కొంది.
హైకోర్టులో నవంబరు 17న ఎన్నికల జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎండీ మనోహర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే రెండు సార్లు విచారణ చేపట్టింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ మేరకు కోర్టు ఏ విషయం తేల్చకుండా ఎన్నేళ్లయినా సస్పెన్షన్‌ను కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.