వీఆర్‌ఏ (VRA) లను ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసే ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు (High Court) స్టే ఇచ్చింది. వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై జారీ చేసిన జీవోలను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. జీవోల జారీకి ముందు ఉన్న స్థితినే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న వీఆర్ఏల సర్దుబాటు అంశంపై ఈమధ్యే సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 61 ఏళ్లలోపు వయసున్న 16,758 మంది వీఆర్‌ఏలను వారి విద్యార్హతలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ విరమణ వయసు దాటిన మరో 3,797 మంది కుమారులు లేదా కుమార్తెలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రభుత్వ నిర్ణయంపై కొందరు వీఆర్ఏలు అభ్యంతరం తెలిపారు. చట్టాలు, సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందని.. తమకు రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగగా.. ప్రస్తుతానికి స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఉన్నత న్యాయస్థానం.
వీఆర్ఏల సర్దుబాటు కోసం 14,954 పోస్టులను ఇటీవల మంజూరు చేసింది ప్రభుత్వం. రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్, 2,113 రికార్డ్ అసిస్టెంట్, 679 సబార్డినేట్ పోస్టులు మంజూరు చేసింది. మిషన్ భగీరథ శాఖలో 3,372 హెల్పర్ పోస్టులు, నీటి పారుదల శాఖలో 5,063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మున్సిపల్ శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్ఏల విద్యార్హతలు, సామర్థ్యాల ఆధారంగా వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కానీ, దీన్ని కొందరు వీఆర్ఏలు వ్యతిరేకిస్తున్నారు. తమను రెవెన్యూ శాఖలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.