Telugu News » KCR Sketch : “పథకం” పారేనా!?

KCR Sketch : “పథకం” పారేనా!?

మూడోసారి హ్యాట్రిక్ కొడతామని బీఆర్ఎస్ అంటోంది. లేదు, ఏం చేసినా ప్రజలు మరో ఛాన్స్ ఇవ్వరని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

by admin
opposition criticizing KCR as insecure

– పథకాల మీద పథకాల ప్రకటన
– వరుసబెట్టి ఓటర్లకు వల
– కేసీఆర్ మాస్టర్ ప్లాన్
– ప్రజలు నమ్ముతారా?
– మరోసారి గట్టెక్కిస్తారా?
– లేక, ఇది ఎన్నికల డ్రామాగానే చూస్తారా?
– ఒకవేళ బీఆర్ఎస్ ను కాదంటే..
– ప్రత్యామ్నాయం ఏంటి?
– కాంగ్రెస్ కు జై కొడతారా?
– బీజేపీకి ఛాన్స్ ఇస్తారా?

కేసీఆర్ (KCR) ఎలక్షన్ మేనేజ్ మెంట్ ఎలా ఉంటుందో తెలంగాణ అంతా గత తొమ్మిదిన్నరేళ్లుగా చూస్తూ వస్తోంది. ఎన్నికల సమయంలో ఆయన స్ట్రాటజీలు, ఓటర్ల (Voters) కు వేసే గాలాల గురించి ఏ ప్రతిపక్ష నేతను అడిగినా, ఏ రాజకీయ విశ్లేషకుడిని అడిగినా క్లియర్ గా చెప్పేస్తారు. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఏం చేయడానికైనా ఆయన వెనుకాడరని అంటుంటారు. దీనికి హుజూరాబాద్ (Huzurabad), మునుగోడు (Munugodu) ఉప ఎన్నికలనే ఉదాహరణగా చెబుతారు. రానున్నది సార్వత్రిక యుద్ధం. తెలంగాణ అంతటా గెలుపుబావుటా ఎగురవేయాలి. లేదంటే, మళ్లీ నిలదొక్కుకోవడం కష్టం. అందుకే, కేసీఆర్ తన మాస్టర్ స్కెచ్ తో మరోసారి గట్టెక్కాలని చూస్తున్నారని అంటున్నారు రాజకీయ పండితులు.

opposition criticizing KCR as insecure

2014 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ (BRS)ను ఉద్యమ పార్టీగా ప్రమోట్ చేసుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అన్ని పార్టీల కంటే ఎక్కువ స్థానాలు సాధించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదం, మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలు ఆ ఎన్నికలో బీఆర్ఎస్ విజయానికి కారణమయ్యాయి. అయితే.. రోజులు గడిచేకొద్దీ మిగులు రాష్ట్రం అప్పులు కుప్పగా మారింది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని అనేకమంది ఎన్నో విశ్లేషణలు చేశారు. అనూహ్యంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. పైగా, టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో చంద్రబాబును బూచిగా చూపిస్తూ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించారు. దీనికితోడు ఎప్పటిలాగే తన సంక్షేమ మంత్రాన్ని జపించారు. దాంతో మరోసారి ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు.

ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కొడతామని బీఆర్ఎస్ అంటోంది. లేదు, ఏం చేసినా ప్రజలు మరో ఛాన్స్ ఇవ్వరని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ముమ్మాటికీ కేసీఆర్ ను ఫాంహౌస్ కు పంపడమేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ, కేసీఆర్ మరోసారి పథకాలనే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. డబుల్ బెడ్రూం బూమరాంగ్ అవడంతో జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. నిజానికి, ఇదే పథకాన్ని మొదట్నుంచి అమలు చేయాలని ఈటల రాజేందర్ లాంటి నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ, కేసీఆర్ దీన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. చివరకు ఇప్పుడు అదే పథకంతో మరోసారి మహిళల ఓట్లకు గాలం వేయాలని చూస్తున్నారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

ఇటు దళిత బంధు, బీసీ బంధు, రైతు బంధు, మైనార్టీ బంధు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి.. ఇలా పలు పథకాల లబ్దిదారులంతా బీఆర్ఎస్ కు ఓటేస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు కేసీఆర్. ఇప్పుడు కొత్తగా తెచ్చిన గృహలక్ష్మి లబ్ధిదారులు తమవైపు తిరిగితే తిరుగుండదని భావిస్తున్నట్టుగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపేసి ప్రత్యక్షంగా వారి ఓట్లు.. పరోక్షంగా వారి ఫ్యామిలీల ఓట్లకు గాలం వేశారని.. ఇలా పథకాల లబ్ధిదారులనే నమ్ముకుని ముందుకు వెళ్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం కేసీఆర్ ఏం చేసినా ఓటమి తప్పదని అంటున్నాయి. 2014లో ఉద్యమ పార్టీ ప్రమోషన్ వల్లే గెలిచారని.. 2018లో ముందస్తుకు పోయి తప్పించుకున్నారని.. ఈసారి పక్కాగా ఓటమి తప్పదని అంటున్నాయి. కేవలం ఓట్ల కోసమే ఆ బంధు, ఈ బంధు అంటూ కేసీఆర్ పథకాలు తెస్తున్నారని.. ప్రస్తుతానికి కొందరికి ఇచ్చినా.. తర్వాత ఇస్తారన్న నమ్మకం లేదంటున్నాయి. దళిత బంధునే ఉదాహరణగా చెబుతున్నాయి. హుజూరాబాద్ లో గెలుపు కోసం తెచ్చిన ఈ పథకం.. రెండో విడతపై క్లారిటీ లేదని వివరిస్తున్నాయి ప్రతిపక్షాలు. మరోవైపు బీఆర్ఎస్ ను జనం తిరస్కరిస్తే.. ప్రత్యామ్నాయం ఏంటనే దానిపైనా చర్చ జరుగుతోందని అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో రెండు పార్టీల నేతలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి, ప్రజలు ఎవరికి పట్టం కడతారో.. ఎవరిని ఇంటికి పంపుతారో.. ఉన్న ఈ కొద్ది రోజులే కీలకం.

You may also like

Leave a Comment