– హస్తంలో టికెట్ వార్
– రేవంత్ ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్
– కాట శ్రీనివాస్ అనుచరుల నిరసన
– టికెట్ అమ్ముకున్నారని ఆరోపణ
– గాంధీ భవన్ దగ్గర బెల్లయ్య నాయక్
ఓవైపు ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతోంది.. ఇంకోవైపు నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో ఇంకా కాంగ్రెస్ (Congress) లో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు నిరసనలు ఆపడం లేదు. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడి పని చేస్తున్న తమను కాదని.. ఇటీవల చేరిన పారాచూట్ నేతలకు టికెట్ ఇవ్వడమేంటని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ ను ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధుకు ఇచ్చారు. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ (Kata Srinivas Goud) అనుచరులు భగ్గుమన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. టికెట్ శ్రీనివాస్ గౌడ్ కే ఇవ్వాలని ఆందోళనకు దిగారు. పటాన్ చెరు టికెట్ ను డబ్బులకు అమ్ముకున్నారంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
శ్రీనివాస్ గౌడ్ అభిమానులు ఆందోళనకు దిగడంతో రేవంత్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంటివద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టికెట్ దక్కని ఆశవహుల ఆందోళనలు ఇప్పటిదాకా గాందీభవన్ వరకే పరిమితం కాగా.. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి ఇంటి వద్దకు చేరడంతో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత బెల్లయ్య నాయక్ గాంధీ భవన్ లో ఆందోళనకు దిగారు. గాంధీ విగ్రహాం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డిలో రెండు చోట్ల పోటీ చేసే బదులు.. కామారెడ్డి టికెట్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.