బీఆర్ఎస్ (BRS) సర్కార్ పై యుద్ధంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే నెల రోజుల యాక్షన్ ప్లాన్ కు దిగిన నేతలు.. ప్రభుత్వ హామీలపై నిరసన కార్యక్రమాలకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. వరంగల్ లో ప్రజా సమస్యలు, నెరవేరని హామీలపై నిలదీస్తూ.. మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. కానీ, కొందరు నేతలు వారిని ఝలక్ ఇచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరకు రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
పోలీసులు (Police) కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ధర్నాకు, కార్యాలయ ముట్టడికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో వారు ఎంజీఎం జంక్షన్ లో బైఠాయించారు. ఒకానొక సమయంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నాయిని మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో తమను అడ్డుకోలేరని హెచ్చరించారు.
రేవంత్ ఆగ్రహం
కాంగ్రెస్ నేతల అరెస్టులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేసి వారితో కార్పొరేషన్ అధికారులు మాట్లాడాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు వరంగల్ అల్లకల్లోలం అయ్యిందని.. ఒక్క పైసా నష్టపరిహారం గానీ, నివారణ కార్యక్రమాలు గానీ ప్రభుత్వం చేపట్టలేదని ఆరోపించారు.