Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. సిమ్లా, జోషీమఠ్ లలో అనేక ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల్లో మృతి చెందినవారి సంఖ్య 66 కు పెరిగిందని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగి పడడంతో అనేకమంది గల్లంతు కాగా కొందరు తీవ్రంగా గాయపడ్డారని వారు చెప్పారు, శిథిలాల నుంచి బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయన్నారు.
ఈ నెల 13 నుంచి ఒక్క హిమాచల్ ప్రదేశ్ లోనే సంభవించిన వరదల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం సుఖ్ విందర్ సింగ్ సుక్కు తెలిపారు. మరో రెండు రోజుల వరకు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని, ఉత్తరాఖండ్ లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారని ఆయన చెప్పారు.
సిమ్లాలో కూలిపోయిన శివాలయ శిథిలాల నుంచి రెండు మృతదేహాలను, కొండచరియల శిథిలాల నుంచి మరో రెండు మృత దేహాలను నిన్న సహాయక బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. సోమవారం నుంచి కనీసం 19 డెడ్ బాడీలను గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. మరో పదిమంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు.
హిమాచల్ లో బుధవారం కూడా అన్ని స్కూళ్ళు, కాలేజీలను మూసివేశారు. సమ్మర్ హిల్ ప్రాంతంలో ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, పోలీసులు నిర్విరామంగా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా వీటిని కొన్ని గంటలపాటు నిలిపివేయవలసి వస్తోంది. మండి జిల్లాలో బియాస్ నది ఇంకా ఉప్పొంగి ప్రవహిస్తూనే ఉంది. వరదల వల్ల 700 కు పైగా రహదారుల్లో రాకపోకలను కూడా నిలిపివేశారు.హిమాచల్ యూనివర్సిటీ ఈ నెల 19 వరకు బోధనా కార్యక్రమాలను ఆపివేస్తున్నట్టు ప్రకటించింది.