తమిళనాడు (Tamil nadu) లో ఓ హిందూ పుణ్య క్షేత్రం పేరును మారుస్తామంటూ ఓ క్రైస్తవ ఫాస్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రోడ్ జిల్లాలో 300 ఏండ్ల నాటి చెన్నిమలై (Chenni Malai) మురుగన్ ఆలయం పేరును మారుస్తామంటూ రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. చెన్ని మలై పేరును జీసస్ మలైగా మార్చేందుకు మైక్ లో ప్రసంగాలు చేశారు. దీంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
క్రైస్తవ ఫాస్టర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హిందువులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల మంది హిందువులు ఆలయం దగ్గరకు చేరుకుని నిరసనకు దిగారు. ఫాస్టర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోరుబాట బట్టారు. మొదట్లో చెన్నిమలై ఆలయాని సమీపంలో హిందువుల నివాసాలకు సమీపంలో అక్రమంగా ప్రార్థనలను సదరు ఫాస్టర్ మొదలు పెట్టారు.
ప్రార్థనల సమయంలో హిందూ దేవతల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, హిందువుల మనోభావాలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేసే వారు. ఈ క్రమంలో సదరు ఫాస్టర్ తో బీజేపీ నేతలు, హిందూ మున్నాని సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో హిందూ సంఘాల నేతలపై కేసులు నమోదయ్యాయి. అనంతరం మైక్ ల్లో హిందువులను రెచ్చ గొట్టేలా ఫాస్టర్ వ్యాఖ్యలు చేశారు.
మత మార్పిడీలు చేస్తామని, చెన్నిమలై ఆలయం పేరును జీసస్ మలైగా మారుస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్థానిక హిందువులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాస్టర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆలయం దగ్గర నిరసనకు దిగారు. విషయం తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులు అక్కడికి చేరుకుని నిరసనలకు మద్దతు తెలిపారు.