హైదరాబాద్లో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు (No Stock Board)లు కనిపిస్తున్నాయి. ఏ పెట్రోల్ బంకు చూసినా భారీగా వాహనాదారుల క్యూ కనిపిస్తోంది. బహీర్ బాగ్, హైదర్ గూడ, లక్డీకపూల్ తో పాటు ఇతర ప్రాంతాల్లో పెట్రోల్ బంకు (petrol bunk)ల ముందు భారీగా రద్దీ కనిపిస్తోంది. రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె నిర్వహించనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు.
భారీగా వాహనదారులు పెట్రోల్ బంకులకు వస్తుండటంతో వారిని అదుపు చేయడం ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చాలా వరకు పెట్రోల్ బంకుల యజమానులు నో స్టాక్ బోర్డు పెడుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ఉంటున్నాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది.
తాజాగా హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది. ఏదైనా ఒక వాహనం ఓ వ్యక్తి ఢీ కొట్టి వెళ్లిపోతే ఆ వాహనంపై రూ. 10 లక్షల వరకు జరిమానాను ఈ కొత్త చట్ట ప్రకారం విధించనున్నారు. దీనిపై ట్రక్కు డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ట్రక్కు, లారీ డ్రైవర్లను మాత్రమే బాధ్యుల్ని చేస్తున్నట్టు కనిపిస్తోందని డ్రైవర్లు తెలిపారు.
చాలా సందర్బాల్లో బాధితుల తప్పుకూడా ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ఈ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల సమ్మే నేపథ్యంలో మహారాష్ట్ర, హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. ఈ వార్తల నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు.