Telugu News » Sahiti Scam : సాహితీ అమీన్ పూర్ స్కామ్ లో ఎవరెవరికి ఎంత ముట్టింది..? ‘రాష్ట్ర’ చేతిలో లెక్కల చిట్టా..!

Sahiti Scam : సాహితీ అమీన్ పూర్ స్కామ్ లో ఎవరెవరికి ఎంత ముట్టింది..? ‘రాష్ట్ర’ చేతిలో లెక్కల చిట్టా..!

ప్రజల నుంచి సాహితీ లక్ష్మీ నారాయణ వసూలు చేసిన సొమ్ములో చాలా డబ్బు పక్క దారి పట్టింది. ఆ వివరాలను చూస్తే.. ఫినిక్స్ అండ్ ఒమిక్స్ సంస్థలకు ల్యాండ్ అడ్వాన్స్ కింద రూ.104 కోట్లు వెళ్లాయి.

by admin
special story on sahiti ameenpur pre launch scam

– ప్రీలాంచ్ పేరుతో జనం సొమ్ము దోపిడీ
– అమీన్ పూర్ లో రూ.430 కోట్ల వసూలు
– చాలా సొమ్ము సైడ్ చేసిన లక్ష్మీ నారాయణ
– ఫినిక్స్, ఒమిక్స్ సంస్థలకు ఎక్కువ ట్రాన్స్ ఫర్స్
– బడా స్కామ్ లో నలిగిపోయిన తెలంగాణ రైతులు, కస్టమర్లు
– ‘రాష్ట్ర’ చేతిలో సాహితీ చిట్టా

ప్రీలాంచ్ స్కాముల కట్టడి కోసం గ‌త‌ కాంగ్రెస్ (Congress) ప్ర‌భుత్వం రెరా చ‌ట్టానికి రూప‌క‌ల్ప‌న చేయగా.. బీజేపీ (BJP) సర్కార్ అమ‌ల్లోకి తెచ్చింది. దీని ఫ‌లితంగా మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, హ‌ర్యానా ఇలా చాలా రాష్ట్రాల్లో ప్రీలాంచ్ స్కాములు కట్టడి అయ్యాయి. కానీ, తెలంగాణ‌ (Telangana) లో మాత్రం పూర్తి భిన్నంగా సాగింది. రెరా (RERA) నిర్లక్ష్యంతో దేశ‌మంత‌టా తెలంగాణ రాష్ట్ర ప‌రువు పోయేలా ఎన్నో స్కాములు జరిగాయి. వాటిలో సాహితీ (Sahiti) సంస్థ చేసిన అమీన్ పూర్ ప్రీలాంచ్ దందా ఒకటి. అనేక ప్రాజెక్టులతో ప్రజల నుంచి అక్ర‌మంగా సొమ్ము వ‌సూలు చేసిన బూదాటి లక్ష్మీ నారాయణ.. తన ఇష్టానికి వాడేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్ని ఇప్పటికే ‘రాష్ట్ర’ (Raashtra) ఆధారాలతో సహా బయటపెట్టింది. ఇప్పుడు అమీన్ పూర్ (Ameenpur) వసూళ్ల దందాలో పక్కదారి పట్టిన నగదు లెక్కలను చూద్దాం.

special story on sahiti ameenpur pre launch scam

అసలేంటీ ప్రాజెక్ట్.. సాహితీ ఏం చేసింది?

అమీన్ పూర్ లో 23 ఎకరాల్లో సాహితీ ఇన్ఫ్రా టెక్ వెంచర్ వేసింది. మొత్తం 4,300 ప్లాట్లు అంటూ ప్రచారం చేసింది. 2019 జూన్ లో ప్రీలాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఫ్లాట్లను విక్రయించడం మొదలు పెట్టింది. దాదాపు 1700 మంది నుంచి రూ.430 కోట్ల దాకా వసూలు చేసింది. 2023 మార్చి కల్లా ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సంస్థ ఇంతవరకూ నిర్మాణం చేపట్టింది లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.25 లక్షలు, ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.35 లక్షల చొప్పున వసూళ్లకు పాల్పడ్డాడు లక్ష్మీ నారాయణ. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనుల్లో అడుగు పడకపోవడంతో బాధితులు ఆందోళన బాట పట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అమీన్ పూర్ ల్యాండ్ వివరాలు

మొత్తం ప్రాజెక్ట్ – 23 ఎకరాలు
మొత్తం కస్టమర్స్ – 1700 మంది
వసూలు చేసిన నగదు- 430 కోట్లు
వీ బసవరాజు – 8 ఎకరాలు
ట్విలైట్ ప్రాపర్టీ – 3 ఎకరాలు
భవ్య ఎస్టేట్స్ – 1.5 ఎకరాలు
పీ రామ్మోహన్ రావు – 2.25 ఎకరాలు
పీ లక్ష్మి నరసింహా – 0.25 ఎకరాలు
దేవీ ప్రాపర్టీ – ఎకరం
కే శ్రీనివాస్ రావు – 4 ఎకరాలు
ఒమిక్స్ శ్రీనుబాబు – 5 ఎకరాలు

పక్కదారి పట్టిన నిధులు

ప్రజల నుంచి సాహితీ లక్ష్మీ నారాయణ వసూలు చేసిన సొమ్ములో చాలా డబ్బు పక్క దారి పట్టింది. ఆ వివరాలను చూస్తే.. ఫినిక్స్ అండ్ ఒమిక్స్ సంస్థలకు ల్యాండ్ అడ్వాన్స్ కింద రూ.104 కోట్లు వెళ్లాయి. అలాగే, ఇతర భూముల వారికి ల్యాండ్ అడ్వాన్స్ రూ.74 కోట్లు ఇచ్చారు. అనుబంధ ప్రాజెక్టుల కోసం రూ.20 కోట్లు, బీఎల్ఎన్ వ్యక్తిగత అవసరాల కోసం రూ.67 కోట్లు, టీటీడీ సహా ఇతర డొనేషన్ల కోసం రూ.14.34 కోట్లు, వినోద్ కెడియాకు రూ.45 కోట్లు సమర్పించుకున్నారు. ఏజెంట్ కమిషన్ రూ.40 కోట్లు, క్యాష్ డిపాజిట్ రూ.51 కోట్లు, పది ఎకరాల పర్మిషన్ అండ్ ఇతర ఖర్చుల కోసం 15 కోట్లు కేటాయించారు.

ఫినిక్స్ కు డబ్బులు ఇవ్వడం వెనుక మర్మమేంటి..?

ఈ ప్రాజెక్ట్ తో పెద్దగా సంబంధం లేని ఫినిక్స్ సంస్థకు అధిక సంఖ్యలో డబ్బులు ముట్టడమే పెద్ద ప్రశ్నగా మారింది. యజమాని పేరు మీద ప్రభుత్వ వాల్యూ ప్రకారం 15 కోట్లు వెళ్లగా.. మిగతావి క్యాష్ గా ఇచ్చారు. దీని వెనుక రహస్యం పోలీసులే ఛేదించాలి. నిజానికి రైతుల నుంచి సేకరించిన భూమికి ఇచ్చింది కోటిన్నర మాత్రమే. కానీ, ఫినిక్స్ కు రూ.8.5 కోట్లు లెక్కగట్టి ఇచ్చారు. దీంతో తెలంగాణ రైతులు దారుణంగా మోసపోయినట్టయింది. అలాగే, కస్టమర్ల సొమ్ము ఇతరుల వశమైంది. ఫినిక్స్, బూదాటి లక్ష్మీ నారాయణ కలిసి తమను ముంచేశారని తెలంగాణ రైతులు అంటున్నారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వం కూడా నష్టపోయింది. రిజిస్ట్రేషన్ వాల్యూ విషయంలో రూ.16 కోట్లకు పైగా నష్టపోయినట్టే.

Raashtra Exclusive Story on Sahiti Lakshmi Narayana Transactions

సొంతానికి వాడేసుకున్న లక్ష్మీ నారాయణ

ప్రజల ఆశల్ని ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేసిన బూదాటి.. వసూలు చేసిన 430 కోట్లలో చాలా వరకు పర్సనల్ అవసరాల కోసం వాడేసుకున్నాడు. దాదాపు రూ.67 కోట్లు వాడుకున్నాడు. అలాగే, రూ.52 కోట్లను క్యాష్ రూపంలో సైడ్ చేశాడు. కుమారుడికి రూ.5 కోట్లు, కుమార్తెకు రూ.2 కోట్లు ఇచ్చాడు. ఇవి కాకుండా రూ.104.92 కోట్ల రూపాయలను ల్యాండ్ అడ్వాన్సుల రూపంలో తరలించాడు. వీటిలో ఫినిక్స్, ఒమిక్స్ సంస్థలకే అధికంగా నగదు సరఫరా అయింది. అలాగే, ఫినిక్స్ తో పాటు ఇతర కంపెనీలకు లోన్స్, అడ్వాన్సుల రూపంలో పంపిన అదనపు సొమ్ము రూ.129 కోట్లకు పైనే ఉంటుంది.

క్యాష్ డిపాజిట్లు 112 కోట్లకు పైనే!

అమీన్ పూర్ లో వసూలు చేసిన సొమ్ములో చాలావరకు బూదాటి తన సొంత కంపెనీలకు తరలించాడు. క్యాష్ డిపాజిట్ల ద్వారా రూ.112.58 కోట్లను మళ్లించాడు. 2019 నుంచి 2023 వరకు పలు దఫాలలో ఈ డిపాజిట్లు జరిగాయి. వాటి వివరాలు చూస్తే.. సాహితీ కన్ స్ట్రక్షన్స్ కు రూ.43 కోట్లు, సాహితీ శ్రీ కన్ స్ట్రక్షన్స్ కు రూ.21 లక్షలు, సాహితీ ఇన్ఫ్రాకు రూ.2.50 లక్షలు, సాహితీ ఇన్ఫ్రా టెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు రూ.68.81 కోట్లు వెళ్లాయి. ఇంకా కొన్ని కంపెనీలకు చిన్న మొత్తాల్లో నగదు తరలింది. అయితే.. ఇంత మొత్తంలో నగదు క్యాష్ డిపాజిట్ ఎలా చేశారు? బ్యాంకులు ఎలా యాక్సెప్ట్ చేశాయి? పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఆ దిశగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడేం చేయాలి..?

సాహితీ సంస్థ నుంచి లక్ష్మీ నారాయణ తన కుమారుడికి నగదు ట్రాన్స్ ఫర్ చేశాడు. తర్వాత అతని అకౌంట్ నుంచి శిభ ఇన్ఫ్రా టెక్ కు ఆ సొమ్ము తరలింది. ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నది చుక్కపల్లి సతీష్, బూదాటి కొడుకు. వీళ్లు పార్టనర్స్ గా ఉన్న సంస్థకు సాహితీ నగదును తరలించారు. పోలీసులు ఈ లింక్స్ పై ఆరా తీయాలని వేడుకుంటున్నారు కస్టమర్లు. సాహితీ నుంచి ల్యాండ్ అడ్వాన్సుల రూపంలో పలు కంపెనీలకు నగదు వెళ్లింది. అయితే.. ఆ అడ్వాన్సులు తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేయించుకోలేదనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. భూస్వాములకు ఇచ్చామంటున్న రూ.104 కోట్లు, అడ్వాన్సుల రూపంలో తరలిన రూ.129 కోట్లు, పర్సనల్ గా వాడేసుకున్న రూ.112 కోట్ల లెక్కలు బయటకు తీసి.. తమకు ఆ సొమ్ము తిరిగి ఇచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు కస్టమర్లు.

You may also like

Leave a Comment