ఐదు రోజుల కిందట హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెరా సెక్రటరీ శివబాలకృష్ణ (HMDA Former Director Shiva Balakrishna), ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ ఆధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన శివబాలకృష్ణను ఇవాళ ఏసీబీ(ACB) కస్టడీలోకి తీసుకుంది.
చంచల్‌గూడ జైలుకు వచ్చిన ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు శివబాలకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్‌కు నాంపల్లి కోర్టు అనుమతించింది.
శివబాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇవాళ ఉదయం ఏసీబీ అధికారులు బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. శివబాలకృష్ణ పేరుపై ఎస్‌బీఐలో నాలుగు బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు బ్యాంకు లాకర్స్ తెరచే అవకాశాలు ఉన్నాయి.
కాగా, ఈనెల 24వ తేదీన తెల్లవారుజామున ఏసీబీ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయిన 5గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా 17చోట్ల సోదాలు చేశారు. మణికొండలోని బాలకృష్ణ ఇంట్లో, అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో కూడా తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో పదికి పైగా ఐఫోన్లు, అత్యంత ఖరీదైన 50 వాచీలు, భారీగా నగదు, బీరువాలో 5కిలోల బంగారు నగలు, 70 ఎకరాల భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.