ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యాంగబద్ధమేనని హోమ్ మంత్రి అమిత్ షా సమర్థించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ బంగళా ‘సుందరీకరణ’ లో జరిగిన అవినీతిని కప్పిపుచ్చేందుకే ఈ ఆర్డినెన్స్ బిల్లును ఆప్ వ్యతిరేకిస్తోందన్నారు. 2015 లో ఒక పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిందని, దాని లక్ష్యమల్లా ‘ఫైట్’ చేయాలనే తప్ప .. ప్రజలకు సేవ చేయాలన్నది కాదని ఆయన ఆరోపించారు. బ్యూరోక్రాట్ల బదిలీలు, వారి పోస్టింగుల విషయంలో వారికి న్యాయం చేయడం కాకుండా తమ బిల్డింగులు, బంగళాల వంటివాటి నిర్మాణం, సుందరీకరణల్లో జరుగుతున్న అవినీతిని కప్పి పుచ్చడానికి విజిలెన్స్ శాఖపై కంట్రోల్ సాధించడానికే వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ బిల్లుపై గురువారం ఆయన లోక్ సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు.
. ఢిల్లీకి సంబంధించినంతవరకు ఏ చట్టాన్నయినా చేసే అధికారం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తోందని ఆయన చెప్పారు. ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసేందుకు కేంద్రాన్ని అనుమతిస్తూ రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయని అమిత్ షా చెప్పారు. ఈ ఆర్డినెన్సును వ్యతిరేకించడంలో ఆమ్ ఆద్మీ పార్టీకి విపక్ష కూటమి ‘ఇండియా’ మద్దతునిస్తోందని, కానీ ఢిల్లీలో జరుగుతున్న అవినీతికి మీరు సపోర్ట్ ఇవ్వరాదని కోరుతున్నానని అన్నారు. మీరు పెద్ద కూటమిగా ఏర్పడినా ఎన్నికల్లో ప్రధాని మోడీ విజయం సాధించి పూర్తి మెజారిటీతో మళ్ళీ ప్రధాని అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్రహోదా కల్పించాలన్న ప్రతిపాదనను జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ భాయ్ పటేల్, సి. రాజగోపాలాచారి, రాజేంద్రప్రసాద్, బీ.ఆర్.అంబేద్కర్ వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.
కేజ్రీవాల్ అధికార నివాస సుందరీకరణకు 15 కోట్ల నుంచి 20 కోట్లు వ్యయమవుతుందని మొదట అంచనా వేశారని, కానీ అది రూ. 53 కోట్లకు పెరిగిపోయిందని ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ శాఖ .. లెఫ్టినెంట్ గవర్నర్ కు సమర్పించిన నివేదికలో తెలిపిందని అమిత్ షా పేర్కొన్నారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగులు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్ కు కట్టబెట్టే ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ-2023’ బిల్లుకు .. కూటములకు అతీతంగా సభ్యులంతా మద్దతునివ్వాలని ఆయన కోరారు.
నెహ్రూ మళ్ళీ గుర్తుకు వచ్చారా ? కాంగ్రెస్
జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావనను అమిత్ షా తీసుకురావడంపై లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. . మీకు అవసరమనిపించినప్పుడు ఆయన పేరును ప్రస్తావిస్తారని, నిజంగానే నెహ్రూ సలహాలు పాటించి ఉంటే మణిపూర్, హర్యానా వంటి ఘటనలను దేశం చూసేది కాదని ఆయన అన్నారు. ఇక మణిపూర్ అంశాన్ని ప్రస్తావించేందుకు చైర్మన్ అనుమతిని నిరాకరించడంపై నిరసన వ్యక్తం చేస్తూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. ఆర్జేడీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన సభ్యులు సభ నుంచి నిష్క్రమించారు.