పశ్చిమ బెంగాల్ (West Bengal) ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లా మెడికల్ కాలేజీ (Medical College)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కారణ తెలియదు గాని 24 గంటల్లో 9 మంది చిన్నారులు మెడికల్ కాలేజీలో మరణించిన ఘటన కలకలం సృష్టిస్తుంది. మరికొంత మంది నవజాత శిశువుల జీవితాలు ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
వైద్య కళాశాలలోని ఎస్ఎన్సీయూ విభాగంలో చికిత్స పొందుతున్న నవజాత శిశువులు ఏకకాలంలో మృతి చెందడంతో.. పశ్చిమ బెంగాల్ ఆరోగ్య వ్యవస్థపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు మరణించిన శిశువుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు..
మరోవైపు పశ్చిమ బెంగాల్లోని జంగీపూర్ ఆస్పత్రితో పాటు ఇతర చిన్న ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం విషమించినప్పుడు.. లేదా అప్పుడే పుట్టిన శిశువుల పరిస్థితి ఆందోళనకరంగా మారినప్పుడు ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తుంది.
అయితే ఎస్ఎన్సీయూలో 52 పడకలు మాత్రమే ఉన్నాయని.. అవి పేషంట్లకు సరిపోక ఒక బెడ్ మీద ముగ్గురు పిల్లలను ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రి సిబ్బంది తెలుపుతున్నారు.. కానీ రోజుకు 100 మందికి పైగా పిల్లలు అడ్మిట్ అవుతున్నారని అందువల్ల పేషంట్ల బెడ్, ట్రీట్మెంట్ విషయంలో జాప్యం జరుగుతున్నట్టు వారు వెల్లడిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియవలసి ఉంది.