హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ సిబ్బంది దురుసుతనం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు బలితీసుకుంది.కష్టమర్ పెరుగు తీసుకురమ్మన్న పాపానికి రెస్టారెంట్ సిబ్బంది చావగొట్టారు. వివరాల్లోకి వెళితే..పంజాగుట్ట సర్కిల్(Panjagutta Circle) లోని మెరిడియన్(Meridian) హోటల్ కు బిర్యానీ తినేందుకు వచ్చిన కస్టమర్ లియాకత్(Liaquat) ఎక్స్ ట్రా పెరుగు కావాలని అడగడంతో గొడవ ప్రారంభమైంది.హోటల్ లో లియాకత్ పై సిబ్బంది దాడికి పాల్పడ్డారు.
దీంతో విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు ఇరువురిని పొలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక, పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతుండగా చాంద్రాయణగుట్టకు చెందిన లియాకత్ సృహకోల్పోయాడు.అయితే, హుటాహుటిన స్థానిక డెక్కన్ హాస్పిటల్(Deccan Hospital)కు లియాకత్ ను పోలీసులు తరలించారు. హాస్పిటల్ లో చికిత్స అందిస్తుండగా సదరు కస్టమర్ మృతి చెందాడు.
దీంతో మృతదేహాన్ని గాంధీ మార్చురీకి పోలీసులు తరలించారు. డెక్కన్ హాస్పిటల్ దగ్గరకు చేరుకున్న మృతుడి స్నేహితులు ఆందోళనకు దిగారు. దాడి జరిగిన తరువాత హాస్పిటల్ కు తరలించకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడంతోనే మృతి చెందాడని వారు ఆరోపించారు.
లియాకత్ మరణించిన విషయం తెలిసిన ఎంఐఎం ఎమ్మెల్సీకి మీర్జా రెహమత్ బేగ్(Mirza Rahmat Baig) పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను ఎమ్మెల్సీ కోరారు. దీంతో పోలీసుల అదుపులో మెరిడియన్ హోటల్ సిబ్బంది ఉన్నారు.
లియాకత్ పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి తగిన శిక్ష విధిస్తామని పంజాగుట్ట పోలీసులు పేర్కొన్నారు. మెరిడియన్ హోటల్ పై కేసు పెట్టాలని మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు డిమాండ్ చేశారు.