బడ్జెట్ (Budget) ప్రసంగంలో విద్యుత్‌కు సంబంధించి పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)శుభవార్త (Good News)చెప్పారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించారు.
కరెంట్ కష్టాలు లేని దేశ నిర్మాణానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వివరించారు. సోలార్ పథకంలో భాగంగా దేశంలోని కోటి ఇండ్లపై రూఫ్ టాప్ సిస్టమ్‌ను ఇన్ స్టాల్ చేయననున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లతో పేద కుటుంబాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు.
ఈ పథకం వల్ల ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది 15వేల నుంచి 18వేల వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. అంతే కాకుండా మిగులు విద్యుత్ ను పంపిణీ సంస్థలకు విక్రయించుకోవచ్చని తెలిపారు. ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో ప్రధాన మంత్రి సూర్యోదయ యోజనా పథకాన్ని తీసుకు వచ్చారు.
ఈ పథకంలో భాగంగా రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్యుత్ ను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ప్రతి ఇంటిపై సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వ ఆధ్వర్యంలోని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC)లిమిటెడ్ నోడల్ ఏజెన్సీగా పని చేయనుంది.