యెమెన్-ఇరాన్(Yemen-Iran) మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు(Houthi rebels) ప్రయోగించిన నాలుగు మానవ రహిత డ్రోన్ల(Unmanned drones)ను ధ్వంసం చేసినట్లు అమెరికా సైన్యం(USA Army) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఇప్పటికే హౌతీ తిరుగుబాటుదారులు నవంబర్ నుంచి ఇప్పటి వరకు 27సార్లు దాడులు చేశారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన గాజాలో బెంజమన్ నెతన్యూహు సృష్టిస్తున్న ఆరాచకానికి ప్రతీకారంగా హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో ఈ దాడులకు దిగి విధ్వంసం సృష్టించింది.
క్షిపణులు, డ్రోన్లను కాల్చడానికి హౌతీ మిలిటెంట్లు ఉపయోగించిన యెమెన్‌లోని సైట్లపై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూఎస్ నౌకలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది. యూఎస్ సెంట్రల్ కమాండ్(US Central Command) ఎక్స్(X) ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.
‘‘ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణకు మేం కట్టుబడి ఉన్నాం.. యూఎస్ నౌకలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.. ఈ ప్రాంతంలోని వ్యాపార నౌకలు, యూఎస్ నౌకాదళ నౌకలకు దగ్గరగా డ్రోన్లు వస్తున్నట్లు సమాచారం వచ్చింది.. దీంతో వాటిని అమెరికా సైన్యం ధ్వంసం చేసింది’’ అని ట్వీట్ చేసింది.