యూఎస్ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్టు (Washingto Post) సంచలన విషయాలు వెల్లడించింది. భారత్ కు వ్యతిరేక కూటమిని నిర్మించాలని ప్రయత్నించి కెనడా ప్రధాని (Canada PM) విఫలమయ్యారని పేర్కొంది. భారత్ కు వ్యతిరేకంగా తాను చేస్తున్న నిరాధార ఆరోపణలకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారని కథనాలు రాసింది. విదేశీ జోక్యం అంటూ భారత్ పై చేస్తున్న ఆరోపణ విషయంలో పాశ్చాత్య మిత్ర దేశాల మద్దతు కూడగట్టడంలో ట్రూడో ఫెయిల్ అయ్యాడని చెప్పింది.
ఈ సమస్యపై భారత వ్యతిరేక కూటమిని నిర్మించాలని ట్రూడో నిర్ణయించారని పాశ్చాత్య అధికారి ఒకరు వెల్లడించారు. ఖలిస్తాన్ నేత నిజ్జర్ హత్యకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తేందుకు తన మిత్ర దేశాలు, ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్‌వర్క్ సభ్యులను ముందుకు తీసుకు వస్తున్నాడని చెప్పారు. ఈ విషయంలో పాశ్చాత్య మిత్ర దేశాలు అన్నీ ఒకే తాటిపైకి రావాలని, నిజ్జర్ హత్యను ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేయాలని వారిపై ఒత్తిడి తెస్తున్నాడన్నారు.
కెనడా అభ్యర్థనను పాశ్చాత్య మిత్ర దేశాలు తిరస్కరించాయని వాషింగ్టన్ పోస్టు తెలిపింది. కెనడా వ్యాఖ్యలను మిగిలిన ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ దేశాలు (యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే)లు ఖండించాయని వివరించింది. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యానికే ఆయా దేశాలు ప్రాధాన్యత ఇచ్చాయని స్పష్టం చేసింది.
ఈ పరిణామాలు కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్చా వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ తో వాణిజ్య చర్చలు కొనసాగిస్తామని ఆయన కుండబద్దలు కొట్టారు. భారత్ తో సంబంధాలు మునుపటి లాగే కొనసాగుతాయన్నారు. కెనడియన్ అధికారులు ఇప్పుడు తమ దర్యాప్తును కొనసాగించుకోవాలని, ముందస్తుగానే తాను ఈ విషయంపై స్పందించబోనన్నారు.