జపాన్ (Japan) ప్రకృతి వైఫరీత్యాల ధాటికి అల్లాడిపోతోంది. కొత్త సంవత్సరం రోజు సంభవించిన భూకంపం (Earthquake)వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ భూకంపంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 62మంది మృతి చెందగా, భవన శిథిలాల కింద వందల సంఖ్యలో బాధితులు చిక్కుకునట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని జపాన్ ప్రధాని కిషిదా (Prime Minister Kishida) పేర్కొన్నారు.
మరోవైపు నిన్నటి నుంచి ఇప్పటివరకూ జపాన్ లో 150కి పైగా భూప్రకంపనలు సంభవించినట్లు అధికారవర్గాలు ప్రకటించాయి. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుస భూప్రకంపనలు బెంబేలెత్తించాయి. 3.4తీవ్రతతో మొదలైన ప్రకంపనలు ఒకదశలో వాటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6కు పెరిగినట్లు అమెరికా భూభౌతిక సర్వే విభాగం వెల్లడించింది. కాగా మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు భూకంపం ధాటికి రహదారులు చాలాచోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లపై వెళ్తున్న వాహనాలు భూమిలో కూరుకుపోయాయి. పెద్దపెద్ద భవనాలు పేకమేడలా కూలాయి. వాటి శిథిలాల కింద వందల సంఖ్యలో ప్రజలు చిక్కుకొన్నట్లు భావిస్తున్నారు. భారీ భూకంపం ధాటికి ప్రాణ నష్టంతో పాటు, భవనాలు కూలడం, అగ్నిప్రమాదాలు సహా పెద్దఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు జపాన్ ప్రధాని ఫ్యూమియో కుషిదా ప్రకటించారు.
భూకంపం కారణంగా 45వేల గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని, ఈ ప్రాంతంలో నీరు గడ్డకట్టే స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయని, చాలా నగరాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వాజిమా పోర్టులో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించటంతో పాటు, ఏడంతస్థుల భవనం కుప్పకూలింది. నగరంలోని అసైచి వీధిలో భూకంపం కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది.
ఈ మంటల ధాటికి 200 భవనాలు కాలిపోయాయి. ఇషికావాలోని సుజు ప్రాంతంలో… 50కి పైగా భవనాలు కూలిపోయాయని అధికారులు ధ్రువీకరించారు. వీటిల్లో ఓ ప్రార్థనా మందిరం కూడా ఉంది. ఇక్కడి పోర్టును సునామీ అలలు తాకడంతో చాలా పడవలు బోల్తాపడ్డాయి. షికా ప్రాంతంలో టోగి వైద్యశాల భవనం ధ్వంసమైంది. పెద్ద మొత్తంలో ఇళ్లు కూలిపోయాయి. మరోవైపు మంగళవారం కూడా భూప్రకంపనలు ఆగకపోవడం సహాయక చర్యలకు పెద్ద అడ్డంకిగా మారిందని అధికారులు తెలిపారు.
వేల సంఖ్యలో జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఫైర్ ఫైటర్లు, పోలీసులను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. దెబ్బతిన్న ప్రధాన రహదారుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని జపాన్ రక్షణ మంత్రి మినోరు కిహారా తెలిపారు. నష్టాన్ని అంచనా వేసేందుకు 20 సైనిక విమానాలను పంపామని వివరించారు. భూకంప కేందానికి చుట్టూ ప్రధాన రోడ్డు మార్గాలను మూసివేశారు. టోక్యో నుంచి బుల్లెట్ ట్రైన్ సేవలను నిలిపేశారు. భారీ భూకంపం నేపథ్యంలో..జపాన్‌లో సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికలను ఎత్తివేశారు.