– ప్రజా పాలన నేపథ్యంలో జనం అవస్థలు
– మీ సేవా కేంద్రాల దగ్గర ఫుల్ రష్
– ఆధార్ అప్డేట్ కోసం భారీ క్యూలైన్లు
– నిలబడలేక చెప్పులు పెడుతున్న ప్రజలు
– గత కాంగ్రెస్ పాలనను గుర్తు చేస్తున్న బీఆర్ఎస్
– సోషల్ మీడియాలో ట్రోల్
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ (Telangana) లో తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ (Congress). రాష్ట్రాన్ని కేసీఆర్ (KCR) నాశనం చేశారని.. తెలంగాణ ఆర్థిక కష్టాల్లో ఉందని చెబుతోంది. శ్వేతపత్రాలు అంటూ హడావుడి చేస్తోంది. ఇదే సమయంలో ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజా పాలన అంటూ దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే.. దరఖాస్తులు ఇచ్చేందుకు, ఆధార్ కార్డుల అప్డేట్ కు జనం బారులు తీరడం చర్చనీయాంశంగా మారింది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో ఎదురైన పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నామంటూ ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.
గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో లబ్ధిదారులకు అభయహస్తం దరఖాస్తులను పంపిణీ చేసి అక్కడే తీసుకుంటున్నారు. దీంతో ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. రెండో రోజు తెల్లవారుజాము నుంచే సంబంధిత కార్యాలయాల వద్ద ప్రజలు క్యూలైన్లలో నిలబడ్డారు. ఇటు అభయహస్తం ధరఖాస్తుకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో అప్డేడ్ కోసం ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆధార్ కేంద్రాల వద్ద కూడా జనం క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల నిలబడే ఓపికలేక చెప్పులను లైన్లలో ఉంచుతున్నారు.
క్యూలైన్లలో చెప్పులు పెట్టిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ సర్కార్ పై విమర్శల దాడి మొదలుపెట్టాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పదేళ్ల క్రితం కాంగ్రెస్ పాలనను గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు ఏది కావాలన్నా భారీ క్యూలైన్లు.. చెప్పులు కనిపించేవి.. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొందని సెటైర్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం సమయంలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ముందే హెచ్చరించినా జనం అప్రమత్తం కాలేదని.. ఇప్పుడు ఏం జరిగిందో చూశారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు, హైదరాబాద్ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి కూడా జనం పోటెత్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగింది. అయితే.. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తెల్లవారుజామునే ప్రజా భవన్ కు చేరుకున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా లైన్లలో నిల్చున్నారు.