మానవ అక్రమ రవాణా(Human Trafficking) ఆరోపణల నేపథ్యంలో ఫ్రాన్స్(France)లో భారత విమానాన్ని ఫ్రెంచ్ అధికారులు ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ రొమేనియా విమానానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. 276మంది ప్రయాణికులతో మంగళవారం తెల్లవారు జామున 4గంటలకు ముంబై చేరుకుంది. ఈ విమానం భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరింది.
దుబాయ్ నుంచి నికరాగ్వా వెళ్తున్న ఈ విమానంలో 303 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ విమానం భారత్‌కు తిరిగి వచ్చేసరికి అందులో కేవలం 276 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. మరి అందులో ఉన్న మిగతా 27 మంది భారతీయులు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఈ విమానాన్ని మానవ అక్రమ రవాణా అనుమానంతో గురువారం పారిస్‌కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలో వాట్రీ విమానాశ్రయంలో ఆపివేశారు. ఈ విమానంలో 21 నెలల చిన్నారితో పాటు 11 మంది మైనర్లు కూడా ఉన్నారు. ఆదివారం విమానం మళ్లీ ప్రయాణించేందుకు ఫ్రాన్స్ అధికారులు అనుమతి ఇచ్చారు. సోమవారం ఈ విమానం 276 మంది ప్రయాణికులతో భారత్‌కు బయలుదేరింది.
మిగిలిన 27 మంది ప్రయాణికుల్లో 25 మంది ఫ్రాన్స్‌లో ఉండేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. అదే సమయంలో మరో ఇద్దరు ప్రయాణికులను కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి అక్కడి నుంచి విడుదల చేశారు. సోమవారం ఈ విమానం భారత్‌కు బయలుదేరిన తర్వాత ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ఫ్రెంచ్ అధికారులకు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపింది.
మానవ అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారులు శుక్రవారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆయన కస్టడీని శనివారం 48 గంటల పాటు పొడిగించారు. ఇంతలో, విమానయాన సంస్థ స్మగ్లింగ్‌లో ప్రమేయం లేదని ఖండించింది. ఫ్రాన్స్‌లో మానవ అక్రమ రవాణాకు 20 సంవత్సరాల వరకు శిక్ష విధిస్తారు.