హైదరాబాద్ (Hyderabad) మహానగరం.. లక్షల మందికి ఆదాయ రాజధాని. ఇక్కడ లక్ష రూపాయలతో భోజనం చేసే మహానుభావులు ఉన్నారు. 5 రూపాయల బన్ తో కడుపు నింపుకునే పేదలూ ఉన్నారు. నాయకులు వస్తున్నారు.. పోతున్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి.. మారుతున్నాయి. కానీ, వీరి జీవితంలో మార్పు అనేది ఉండడం లేదు. పూట గడవడానికి నానా పాట్లు పడాల్సి వస్తోంది.
హైదరాబాద్ ను డల్లాస్ (Dallas) చేస్తాం.. న్యూయార్క్ (New York) చేస్తామన్న నాయకుల మాటలకు.. వాస్తవానికి చాలా తేడా ఉంది. తాజాగా వెలుగుచూసిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ (KTR) శనివారం ప్రారంభించారు. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు మొత్తం 2.62 కిలోమీటర్ల మేర రూ.450 కోట్లతో దీన్ని నిర్మించారు. అయితే.. ఈ కార్యక్రమ సమయంలో ఓ సన్నివేశం తెలంగాణ వాస్తవ పరిస్థితికి అద్దం పట్టింది.
ఓవైపు అమెరికా (America) తో పోటీ పడుతున్నామని బీఆర్ఎస్ (BRS) నేతలు తెగ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, నగరంలోని అందరూ మూడు పూటలా భోజనం చేస్తున్నారా?.. ఈ ఫోటో చూశాక కానే కాదనే సమాధానం ఎవరినడిగినా చెప్తారు. స్టీల్ బ్రిడ్జి (Steel Bridge) ఓపెనింగ్ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న నలుగురు చిన్నారులు అక్కడకు వచ్చారు. పిడికెడు బువ్వ దొరకకుండా ఉంటుందా.. తమ కడుపులు నిండకుండా ఉంటాయా.. అని ఎంతో ఆశతో ఉన్నారు. అంతమంది జనంలో పోరాడి ఎలాగోలా అతి కష్టంమీద ఓ భోజన ప్యాకెట్ సంపాదించారు. ఉన్నది నలుగురు. దొరికింది ఒకటే ప్యాకెట్. ఒకరు తింటే ముగ్గురు పస్తే. కానీ, ఆ పసి హృదయాలు ఉన్న ఒక్క ప్యాకెట్ లోని భోజనాన్ని పంచుకుని తిన్నాయి. ఇది చూసిన వారంతా బంగారు తెలంగాణ ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు కేసీఆర్ సర్కార్ (KCR Govt) ను ఆడుకుంటున్నాయి. బంగారు తెలంగాణ-భవిష్యత్తు తెలంగాణను చూడండి అంటూ కొందరు నెటిజన్లు ఘాటైన కామెంట్స్ పెడుతున్నారు.