తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార పర్వంలో తలమునకలయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేస్తున్నారు. ఇంకొందరు నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తూ అందరి చూపును తమ వైపు తిప్పుకుంటున్నారు.
సాధారణంగా ఎమ్మెల్యే అభ్యర్థులు వారు పోటీ చేస్తున్న స్థానాల్లో ఏం చేస్తారో చెప్పి ఓట్లను అడగడం సహజం. కానీ అందుకు భిన్నంగా హుజూరాబాద్ (Huzurabad) ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం అభ్యర్థించిన తీరు కాస్త ఆశ్చర్యాన్ని గురిచేయక మానదు. నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాడి కౌశిక్ రెడ్డి(Padi Koushik Reddy) ఓటర్లను అభ్యర్థించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇంతకీ కౌశిక్‌రెడ్డి ఏమన్నారంటే.. ‘మాకు ఓటేయకుండా ఇక మీ ఇష్టం.. మా ముగ్గురు శవాలను చూడండి.. ఓటేసి గెలిపిస్తే విజయ యాత్రకు వస్తా.. లేదంటే 4వ తేదీ నా శవయాత్రకు రండి.. మీ కడుపులో తలపెడతా.. మీ కాళ్లు పట్టుకుంటా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. మీ దయ, మీ దండం.. ఒక్కసారి కాపాడండి.. గెలిపించండి.. ఓడగొట్టి ఉరితీసుకోమంటారా..?’ అంటూ ఓటర్లను బతిమాలారు.
కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఓట్లు అడిగే తీరును చూసి పలువురు నివ్వెరబోతున్నారు. ఎవరైనా ఓట్లు కావాలంటే అభివృద్ధి చేస్తామని చెప్పాలి కానీ.. ఇలా చస్తానంటూ బెదిరించడం ఎంతవరకు సమంజసమని స్థానిక ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన వ్యాఖ్యల తీరుకు ఇంకా షాక్ నుంచి కోలుకోవడం లేదు. ఇక ఎన్నికలు ముగిసేసరికి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని హుజూరాబాద్ ప్రజలు టెన్షన్ పడుతున్నారు.