అతడొక చిల్లర దొంగ(Pick Pocketer).. బస్‌స్టేషన్, రైల్వే స్టేషన్లలో పర్సులు, బ్యాగులు, చిన్నచిన్న వస్తువులను దొంగలించడం ఆ దొంగకు అలవాటు. అయితే ఆ చిల్లర దొంగ పోలీసులకే చెమటలు పట్టించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
చాంద్రాయణగుట్ట(Chandrayana gutta) లోని సీఆర్పీఎఫ్(CRPF) 95 బెటాలియన్ కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లు(Constable) విధి నిర్వహణలో భాగంగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) వెళ్లేందుకు ఈనెల 24న రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ఎదురుచూస్తున్న క్రమంలో వారి బ్యాగును ఓ చిల్లర దొంగ అపహరించాడు. అయితే.. బ్యాగులో ఉన్నది డబ్బులో.. బంగారమో.. ఇతర వస్తువులో కాదు. అందులో ఉన్నది.. పోలీసుల ఆయుధాలు ఉన్నాయి. ఇది తెలియని ఆ చిల్లర దొంగ ఆయుధాల బ్యాగ్‌ను అపహరించుకుపోయాడు.
బ్యాగ్ కనిపించకపోవడంతో కానిస్టేబుళ్లు వెంటనే జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బ్యాగ్‌లో 60 రౌండ్ల బుల్లెట్లు, రెండు మ్యాగజైన్లు ఉన్నాయి. జీఆర్పీతో పాటు రైల్వే రక్షకదళానికి చెందిన ఎనిమిది బృందాలు దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరికి ఆ చిల్లర దొంగ శ్రీకాకుళానికి చెందిన ఆనందమూర్తిగా పోలీసులు గుర్తించారు.
గాంధీనగర్ మెట్రో స్టేషన్ వద్ద దొంగను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బ్యాగ్‌లో ఆయుధాలు ఉండడంతో గాంధీనగర్ మెట్రో పిల్లర్ వద్ద పడేశానని చెప్పాడు. మెట్రో పిల్లర్ వద్ద సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వృద్ధుడు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్న వృద్ధుడు సత్యనారాయణ వద్ద ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో కేసును చేధించిన పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు.