హైదరాబాద్(Hyderabad) నూతన సీపీ(CP)గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(Kothakota SrinivasReddy) బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఇన్చార్జి సీపీ సందీప్ శాండిల్యా నుంచి శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చీరావడంతోనే తొలి ఆదేశాలు జారీ చేశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన శక్తి సామర్థ్యాలను గుర్తించి తనకు హైదరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పజెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ కాస్త అవహేళనకు గురవుతోందని సీపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సినీ ఇండస్ట్రీలో మత్తు పదార్థాలకు డిమాండ్ చాలా ఉందని, ఇండస్ట్రీకి చెందిన పలువురు మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.
మాదకద్రవ్యాలపై ఒకసారి సినీ ఇండస్ట్రీ వారితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అయినా మార్పు రాకుంటే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నగరంలోని పబ్స్, రెస్టారెంట్లపై 24/7 నిఘా ఉంటుందని సీపీ చెప్పారు. పార్టీల పేరుతో మత్తు పదార్థాలు సరఫరా చేస్తే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తామన్నారు.