Hyderabad Fancy Numbers: ఈ నెంబరుకి ఎంత డిమాండో తెలుసా…?
వాహనాల (Vehicles) విషయంలో కొన్ని నెంబర్లంటే సెంటిమెంట్లు (Number Sentiment) బలంగా ఉంటాయి. ముఖ్యంగా 9 నెంబరు, వరుస నెంబర్లు కలిపితే 9 రావడం వంటివి చాలా మంది ఫాలో అవుతుంటారు. 1,2,3,4 అంటూ వరుస నెంబర్లకు కూడా డిమాండ్ (Demand) ఎక్కువ. వీటన్నింటిలో కింగ్ ఆఫ్ వెహికిల్ నెంబరు మాత్రం 9999.
వాహన యాజమానుల్లో ఉన్న ఈ నెంబర్ల సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని వేలం నిర్వహించి రవాణాశాఖ ఆదాయం పొందుతూ ఉంటుంది. అలా హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో జరిగిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ లో ఫ్యాన్సీ నంబర్లు భారీ ధర పలికాయి.
ఈస్ట్‌జోన్ పరిధిలో ఆర్టీఏ ఆఫీసులో మంగళవారం రోజు నిర్వహించిన వేలంలో రవాణా శాఖకు ఊహించని ఆదాయం వచ్చింది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్కరోజే రూ.18 లక్షల ఆదాయం వచ్చింది. టీఎస్ 11 ఈజెడ్ 9999 అనే నంబర్ కు రూ. 9,99,999లకు వేలంలో చర్చ్ ఎడ్యుకేషనల్ సొసైటీ దక్కించుకుంది. అలాగే టీఎస్11 ఎఫ్ఏ 0001 నంబర్ ను రూ.3.50 లక్షలకు కామినేని సాయి శివనాగు, అదే సిరీస్ తో 0011 నంబర్ ను శ్యామల రోహిత్ రెడ్డి రూ. 1.50 లక్షలకు దక్కించుకున్నట్లు రవాణాశాఖ అధికారులు చెప్పారు.
గత నెల ఆగస్టులో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ కాసుల పంట పండించింది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్కరోజే రూ.53.34 లక్షల ఆదాయం సమకూరింది. అధికంగా టీఎస్ 09 జీసీ 9999 అనే నంబర్ కు రూ.21.60 లక్షలు పలకగా.. అతి తక్కువగా టీఎస్ 09 జీడీ 0027 నంబర్ కు రూ.1.04 లక్షలు పలికింది.