హైదరాబాద్(Hyderabad) మహానగరంలో పర్యాటక ప్రదేశాల్లో ట్యాంక్ బండ్(Tank bund) ఒకటి. నగరంలో చాలా మంది సాయంత్రం వేళలో హుస్సేన్ సాగర్ (Hussain Sagar) ఒడ్డున సేదతీరుతుంటారు. ట్రాఫిక్ ఉన్నప్పటికీ ప్రశాంతమైన వాతావరణం ఉండడంతో అర్ధరాత్రి వరకు ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి 11.30 నుంచి 12.30గంటల మధ్య ఇక్కడ జన్మదిన వేడుకలను(Birthday celebrations) స్నేహితులు, బంధువులతో కలిసి జరుపుతుంటారు. అయితే, ఇకపై ఆ ఛాన్స్ లేదని అధికారులు చెప్తున్నారు.
హైదరాబాద్ జీహెచ్ఎంసీ(GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంక్ బండ్‌పై ఇకపై బర్త్‌డే వేడుకల సందర్భంగా కేక్ కటింగ్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్యాంక్ బండ్‌పై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. దీనికి కారణం ట్యాంక్ బండ్‌పై విపరీతంగా చెత్త పేరుకుపోతోంది. జన్మదిన వేడుకలకు కేక్ కటింగ్ సందర్భంగా కేక్ కటింగ్, స్ప్రే బాటిళ్లు, ఇతర వస్తువులను అక్కడే చిందరవందరగా పడేస్తున్నారు.
అదేవిధంగా బర్త్‌డే వేడుకల్లో నిమగ్నమై పక్కనే ట్రాఫిక్ ఉందన్న విషయాన్నీ మర్చిపోతున్నారు. దీంతో కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. అదేవిధంగా సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై పలువురు పోలీసులకు, బీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఎట్టకేలకు కఠిన నిర్ణయానికి వచ్చారు. ఇకపై ట్యాంక్ బండ్ వద్ద కేక్ కటింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా కేక్ కట్ చేసి చిందరవందరగా వస్తువులు పడేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. సీసీ కెమెరాల నిఘా ఉంటుందని జీహెచ్ఎంసీ తెలిపింది. ప్రజలు సహకరించాలని కోరింది. ఈ మేరకు ట్యాంక్ బండ్ చుట్టూ జీహెచ్ ఎంసీ అధికారులు నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు.