గతవారంలో భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న హైదరాబాద్ (Hyderabad) నగరంలో మళ్లీ ఇవాళ కుంభవృష్టి వర్షం (Heavy Rains) కురుస్తోంది. మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం (Weather) ఒక్కసారిగా మారిపోయింది. మెల్లగా మొదలైన వాన క్రమంగా భారీవర్షంగా మారింది.
దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ వర్షాలకు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపై పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని ఏరియాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
ఖైరతాబాద్, లక్షీకాపూల్, ట్యాంక్ బండ్, నాంపల్లితో పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎన్ఆర్ నగర్, మెహిదీపట్నంలో భారీగా వర్షం పడుతోంది. ఈ ప్రాంతాలన్నింటిలోనూ వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాగా రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం పడుతున్న సమయంలో చెట్లకు కిందకు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.