సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం డబ్బు, మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు మాదకద్రవ్యాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate)పరిధిలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.
ఎస్వోటీ పోలీసులు భారీగా మత్తు పదార్థాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 5 కిలోల ఓపియం, 24 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకొని ఏడుగురు నిందితులను ఎల్బీ నగర్(LB Nagar) ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి కంటైనర్, 8 బైకులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మత్తు పదార్థాలకు బానిసలై జీవితాల్ని నాశనం చేసుకొద్దని పోలీసులు యువతకు సూచించారు. ఎవరైనా మాదకద్రవ్యాలు అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇటీవల ఏపీలోని విశాఖలో కంటైనర్ నిండా టన్నుల కొద్దీ మత్తు పదార్థాలు పట్టుపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు మత్తు పదార్థాలపై నిఘాను మరింత పెంచారు.
ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన హైదరాబాద్ పోలీసులు మరింత దూకుడు పెంచారు. మరోవైపు రంజాన్ పండుగల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రహదారుల వెంబడి విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.