మూడుముళ్ల బంధం హేళన అవుతోంది. అగ్ని సాక్షిగా కట్టిన తాళి ఊరితాడై బిగిసుకొంటుంది. విలువలు కోల్పోయిన సమాజంలో విలువ లేకుండా బ్రతుకుతున్న మనిషి స్పందన కోల్పోయాడు.. రాయిలా మారాడు. ఇందుకు నిత్యం జరుగుతున్న దారుణాలు ఉదాహరణలు. భార్యాభర్తల బంధం షోకేస్ బొమ్మలా మారిందనడానికి నిదర్శనం అక్రమ సంబంధాల మోజులో పోతున్న ప్రాణాలు.. తాజాగా నగరంలో ఓ భార్య భర్తను ప్రియుడి సాయంతో చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)జిల్లా, జూలూరుపాడు (Julurupadu), గుండ్లరేవు (Gundlarevu)కు చెందిన భూక్య మహేష్, లత బ్రతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కాగా ఆరు నెలల క్రిందట ఈ దంపతులు కేపీహెచ్‌బీ (KPHB) హైదర్‌నగర్ (Hydernagar)లోని రాంనగర్ (Ramnagar)లో అద్దెకు దిగారు.. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మహేష్ కి ఇటీవల పక్షవాతం వచ్చింది. ఈ నేపధ్యంలో మహేష్ స్నేహితుడు, క్యాబ్ డ్రైవర్ అయిన విక్రమ్ తరచుగా వీరి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో లతపై కన్నేసిన విక్రమ్ ఆమెతో అక్రమ సంబంధం ఏర్పరచుకొన్నాడు..
వీరి మధ్య మహేష్ పానకంలో పుడకల తయారు అయ్యాడని భావించిన లత, విక్రమ్.. మహేష్ అడ్డు తొలగించుకోవాలని భావించారు. ఈ ఏడాది జూన్ 22న మహేష్ ని కుర్చీలో కూర్చోబెట్టి ఉరివేశారు. మూర్ఛ వల్లే తన భర్త చనిపోయాడని చుట్టుపక్కల వున్న వారిని భార్య లత నమ్మించింది. కానీ దగ్గరలోని డాక్టర్ వచ్చి చూడగా మహేష్ ఇంకా బ్రతికే ఉన్నట్టు తెలిసింది.
వెంటనే మహేష్ ని హాస్పిటల్లో జాయిన్ చేయగా చికిత్స పొందుతూ జూన్ 23న మృతి చెందాడు. మరోవైపు అతని గొంతు పై గాయం ఉన్నట్టు గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టంకి పంపారు. ఆ రిపోర్టులో మహేశ్ హత్య చేయబడ్డాడని నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు లత ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. ప్రియుడు విక్రమ్‌తో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది.